గర్భవతులు.. బాలింతలకు అంగన్వాడీలో బాలసభ..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామంలో మూడవ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు బాలింతలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గర్భవతి అని నిర్ధారణ అయిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేయించు కోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ తెలిపారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లిదండ్రులకు, బాలింతలకు,గర్భవతులకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు లింగ వివక్ష లేకుండా ఆడపిల్లలను మగ పిల్లల మాదిరిగానే సమానంగా పెంచాలన్నారు. కశోర బాలికల వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఋతుక్రమము జాగ్రత్తలు మహిళా సాధికారికత సామాజిక స్పృహ కలిగి ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. గర్భవతి నిర్ధారణ అయిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవాలని అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే పౌష్టికారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బేటి బచావో-బేటీ పడావో కార్యక్రమం గురించి వివరిస్తూ ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అని పేర్కొన్నారు.పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించారు. అంతేకాకుండా డయేరియా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నీళ్లను వేడి చేసి చల్లారిన తర్వాత త్రాగాలని, భోజనం ముందు చేతుల శుభ్రంగా కడుక్కొని, వేడివేడి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటివి ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వాంతులు విరేచనాలు అయితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షకురాలు డి.రేణుక అంగన్వాడీ కార్యకర్తలు పీజీ కృష్ణవేణి,టి రామలక్ష్మి,డి సుహాసిని మరియు అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.