బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇచ్చి జిల్లా అభివృద్ధికి సహకరించండి
1 min readమానవతా దృక్పథంతో లబ్ధిదారులకు చేయూతనివ్వండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల రుణ మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తత చూపుతున్నారని రాష్ట్రస్థాయి బ్యాంకులు కేటాయించిన లక్ష్యం మేరకు విరివిగా రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరుపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, ఎల్ డి ఎం రవీంద్ర కుమార్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమవర్ధక శాఖ అధికారి గోవిందు నాయక్, మత్స్యశాఖ జెడి రాఘవరెడ్డి, , ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వెంకటరమణ, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో సిసిఆర్సి కార్డులు మంజూరు చేసిన కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని…అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి బ్యాంకర్లు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆర్ఓఎఫ్ఆర్ భూములకు, సూక్ష్మసేద్య పరిశ్రమలకు, మహిళా సాధికారత ఉపాధికి, విద్యా రుణాలు, గృహ రుణాలు, చేనేత రుణాలు, తదితర ప్రాధాన్యత రంగాలకు కేటాయించిన ప్రతి లక్ష్యంలో 50 శాతం కూడా అధిగమించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకొని కేటాయించిన లక్ష్యాన్ని సాధించే దిశలో బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని నిర్ణీత కాల పరిమితిలో ప్రగతి సాధిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలు మినహా ఇతర ఏ ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్ల నుండి సహకారం లేదన్నారు. ప్రభుత్వం పరిశ్రమల యూనిట్ల స్థాపనకు పెద్ద ఎత్తున సర్వే నిర్వహిస్తుందని మానవతా దృక్పథంతో రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లు రుణాల మంజూరులో తీవ్ర జాప్యం చేస్తూ ఎలాంటి సహకారం ఇవ్వడం లేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నూతనంగా ప్రవేశపెడుతున్న ఆయిల్ ఫామ్, ఫ్లోరికల్చర్, డ్రాగన్ ఫ్రూట్, నన్నారి సాగు చేసే రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడానికి 951 మంది రిజిస్టర్ చేయించుకున్నారని నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున 5 గ్రామాలు ఎంపిక చేసామని సంబంధిత లబ్ధిదారులకు రుణాలు మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. జిల్లాలో 800 మంది చేనేత కార్మికులు ఉన్నారని క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద రుణాలు మంజూరు చేసి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. మత్స్యకారులకు వల,పుట్టి పరికరాల కొనుగోలుకు అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ప్రీమియం చెల్లించి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబ సభ్యులకు రెండు లక్ష రూపాయల చొప్పున చెక్కును కలెక్టర్ అందజేశారు.