వైసీపీ ప్రభుత్వంలోనే అక్రమంగా బంకులు వేశారు ..
1 min readమహిళలను అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు
మీడియా సమావేశంలో వైసీపీ నేతలపై మండిపడిన టిడిపి కార్పొరేటర్లు, నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని సీ.క్యాంపులోని మున్సిపల్ స్కూల్ వద్ద అక్రమంగా బంకులు వేశారని 23వ వార్డు వైసీపీ కార్పొరేటర్ కటారి పల్లవి, కటారి సురేష్‌తో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్ వార్డులో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, దీని నుండి ప్రజల దృష్టి మల్లించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులమైన తమను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పైగా ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్యులు టి.జి భరత్ పేరును వాడటం సబబు కాదన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు కర్నూలు ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు మంత్రి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. టి.జి భరత్ ఎప్పుడూ అవినీతి, అక్రమాలను ప్రోత్సహించబోరన్నారు. ఎంబీఏ, డిగ్రీలు చదివిన నిరుద్యోగులు జీవనోపాధి కోసం బంకులు వేసుకుంటే ఓర్వలేక వైసీపీ కార్పొరేటర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బంకుల వల్ల పాఠశాలలో ఎవ్వరికీ ఇబ్బందులు లేవన్నారు. స్కూల్‌కి ప్రహారీగోడ ఉందని మహిళలకు దీని వల్ల సమస్యలే లేదన్నారు. టిడిపి నాయకులపై కక్షతో వైసీపీ నేతలు నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అక్రమంగా బంకులు వేసుకున్నారని, ఇళ్లు సైతం నిర్మించారన్నారు. గత ప్రభుత్వంలో అన్నీ అరాచకాలే జరిగాయని దుయ్యబట్టారు. ఇప్పుడు డబ్బులు తీసుకొని బంకులు వేశారని తమపై బురదజల్లితే చూస్తూ ఊరుకోమన్నారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గతంలో శ్రీరాం నగర్ అభివృద్ధికి మాజీ మంత్రి టి.జి వెంకటేష్ ఎంతో కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పరమేష్, క్రాంతికిషోర్, ఫరాజ్ ఖాన్, తెలుగు యువత పార్లమెంట్ అద్యక్షుడు అబ్బాస్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు గున్నామార్క్, స్వామిరెడ్డి, సుంకన్న, ఖాదర్ బాషా, మోయిన్ బాషా, నవీన్, క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.