మనిషి ఉన్నతంగా ఎలా జీవించాలన్నది భగవద్గీత నేర్పుతుంది..
1 min readమానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీతను అనుసరిస్తే ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎలా జీవించాలి అన్నది నేర్పుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఇండస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన మానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భగవద్గీత పుస్తకాన్ని ఆయన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ ,రిటైర్డ్ కలెక్టర్ రామ శంకర్ నాయక్, రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ఇన్చార్జి మల్లు వెంకట రెడ్డి, మాంటిసోరి విద్యాసంస్థల డైరెక్టర్ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయురాలు శశికళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీలా గొప్పవారు కావాలనుకుంటారని.. అలా కావాలంటే భగవద్గీతను అనుసరించాలని ఆయన సూచించారు. మనిషి ఉన్నతంగా ఎదగడానికి భగవద్గీత దోహదం చేస్తుందని ఆయన తెలియజేశారు. విద్యార్థులు చదువుతోపాటు భగవద్గీతను అనుసరిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన తెలియజేశారు. టిటిడి తరఫున జిల్లాకు రెండు లక్షల భగవద్గీత పుస్తకాలను అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గోమాత సేవలో తరించాలని ఆయన కోరారు. తాను గోమాత సేవలో ప్రవేశించినప్పటి నుంచి మానసిక ప్రశాంతత లభించడంతోపాటు తనకు అంతా మంచి జరుగుతూ వచ్చిందని ఆయన వివరించారు. గోమాత సేవా ఫలితాన్ని తాను అనుభవిస్తున్నానని, అందుకే గోమాత సేవలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థులను కూడా పాఠశాల యాజమాన్యం గోమాత సేవలో పాల్గొనేలా చూడాలని సూచించారు. ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలియజేశారు. ఇక విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆల్రౌండ్ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేదస్సు కీలక పాత్ర పోషించనున్నదని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులో రాణిస్తారని వివరించారు. అనంతరం గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డి.వి రమణ దంపతులను రాష్ట్ర మంత్రి టిజి భరత్ చేతుల మీదుగా సన్మానించారు.