PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాగ్రత్తలతో..‘మెదడు’ పదిలం..

1 min read

ఆల్కహాల్​..ధూమాపానంకు దూరంగా ఉండాలి

  • పౌష్టికాహారం…వ్యాయామం తప్పనిసరి…
  • న్యూరాలజిస్ట్​ డా. చల్లేపల్లె బాబు రావు
  • 22న అంతర్జాతీయ మెదడు దినోత్సవం

కర్నూలు(హాస్పిటల్​), పల్లెవెలుగు:  ఆధునిక ప్రపంచంలో మనిషి అధిక ఒత్తిడికి లోనవుతుండటం… పౌష్టిక ఆహారం లేకపోవడం… వ్యాయామం చేయకపోవడంతో బ్రెయిన్​ స్ర్టోక్​ వచ్చే ప్రమాదం ఉందని, ముందస్తు జాగ్రత్తలతో మెదడును పదిలంగా ఉంచుకోవాలని సూచించారు న్యూరాలజిస్ట్​ డా. చల్లేపల్లె బాబురావు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ (WFN) ప్రతి జూలై 22న అంతర్జాతీయ మెదడు దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త లక్ష్యంపై దృష్టి పెడుతుంది. 2024 ప్రపంచ మెదడు దినోత్సవం యొక్క లక్ష్యం “బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రీవెన్షన్”. 2021 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3.4 బిలియన్ ప్రజలు న్యూరాలజీ జబ్బులతో బాధపడుతున్నారు. 11.1 మిలియన్ ప్రజలు చనిపోతున్నారు. కొన్ని న్యూరాలజీ జబ్బులకు పూర్తిగా నయం చేసే చికిత్సలు అందుబాటులో లేవు. అందుకే ఇలాంటి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి అవసరమైన అవగాహన కల్పించడం తప్పనిసరి. ఇలాంటి జబ్బులు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ప్రధానమైనది.

బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం): ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యే వారు. ఇప్పుడు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్ కు గురై చికిత్స కోసం వస్తున్నారు. మధ్య వయస్సు వారు పక్షవాతం బారిస పడటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. అందుకే స్ట్రోక్ కు గురైన తరువాత ప్రతి నిమిషం విలువైనదే.

బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా, మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలకు అవరోధం కలగడం లేదా చిట్లడం వల్ల మెదడులోని కొంత భాగం మరణానికి దారితీసి స్ట్రోకు గురవుతారు.

పక్షవాతానికి కారణాలివే: యువత ఎక్కువగా స్ట్రోక్ కు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, ఆల్కాహాలు (పోగతాడం, మద్యం సేవించడం) జీవన విధానంలో మార్పులు, రక్తపోటు, మధుమేహం, కొలస్ట్రాల్ ఎక్కువ, ఊబకాయం, గుండె జబ్బులు, ఈస్ట్రోజన్ కలిగి ఉన్న హార్మోన్ థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశము ఎక్కువ. కొంత మందిలో పుట్టుకతోనే జన్యుపరమైన లోపాల కారణంగా రక్తం గడ్డకట్టే గుణం ఉండి పక్షవాతం రావచ్చు. అన్యూరిజం వంటి రక్తనాళాల గోడలు బలహీనంగా ఉండటం వల్ల పక్షవాతం రావచ్చు.

పక్షవాతములో రకాలు :

ఇస్కీమిన్ స్ట్రోక్ : రక్తనాళంలో అడ్డంకుల కారణంగా ఈ విధమైన స్ట్రోక్ వస్తుంది. పక్షవాతానికి గురయ్యే వారిలో 80% ఈ రకమైన పక్షవాతానికే గురవుతారు.

హెమరేజిక్ స్ట్రోక్ : రక్తనాళం చిట్లడం వల్ల వస్తుంది.

పక్షవాతాన్ని గుర్తించడం ఎలా?

1. ఒకవైపు చేయి, కాలు పనిచేయక పోవడం, ఫలితంగా నడవటానికి ఇబ్బంది పడటం

2. ఆకస్మాత్తుగా తల తిరడగం (Vertigo) మరియు శరీరంలో బ్యాలెన్స్ కోల్పోవడం

3. మూతి ఒకవైపుకు వంకరగా పోవడం

4. మాట్లాడే విధానం సరిగా లేకపోయినా లేదా ముద్దగా మాట వస్తున్నా కూడా స్ట్రోక్ అనుమానించాలి.

5. దృష్టి యొక్క ఇబ్బందులు: వ్యక్తి సడన్గా చూపు కోల్పోవడం మరియు వస్తువులు రెండుగా కనిపించడం కూడా చూస్తాము.

6. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, వాంతులు రావడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు రావచ్చు.

స్ట్రోక్ ను నిర్ధారించడం ఎలా?

స్ట్రోక్ అనేది అత్యవసర పరిస్థితి. కనుక స్ట్రోక్ యొక్క రోగ నిర్ధారణ వేగంగా జరగాలి మరియు ఎలాంటి రకమైన స్ట్రోక్ వచ్చిందో తెలుసుకోవడం తప్పనిసరి. దాని కోసం సిటీ స్కాన్, ఎం.ఆర్.ఐ బ్రేయిన్ వంటి పరీక్షలు అవసరం అవుతాయి.

చికిత్స విధానాలు :

స్ట్రోక్ వచ్చిన తరువాత మొదటి 4 – 5 గంటలు అత్యంత కీలకం:

చికిత్స యొక్క విధానం స్ట్రోక్ రకంపై ఆధారపడి ఉంటుంది. రక్తనాళములో అడ్డంకుల వల్ల వచ్చే స్ట్రోక్లో (ఇస్కీమిక్ స్ట్రోక్) (థ్రాంబో లైటిక్ థెరపి, మెకానికల్ థ్రాంబెక్టమి వంటివి ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల తొందరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.

థ్రాంబో లైటిక్ థెరపీ:

అల్టెప్లేజ్ లేదా టీసక్ట్ ప్లేజ్ అనే ఇంజక్షన్ ఇవ్వడం వల్ల రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించ వచ్చును. ఈ ఇంజక్షన్ను పక్షవాతం లక్షణాలు కనిపించిన 4 – 5 గంటల్లోనే చేయగలము.

మెకానికల్ థ్రాంబెక్టమి:

థ్రాంబోలైసిస్ ఇంజక్షన్​ తో తొలగించలేని పెద్ద గడ్డలను తొలగించ వచ్చును.

కరోటిడ్ ఎండార్టెక్టమి అనే ట్రీట్మెంట్తో స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించ వచ్చును.

రక్తం పలుచగా చేసే మందులు రెగ్యులర్​ గా వాడవలసిన అవసరం ఉంటుంది.

బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కోసం మందులు వాడాలి.

హెమరేజిక్ స్ట్రోక్ అయితే బీసీ (రక్తపోటు) తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు లక్షణాల తీవ్రతను బట్టి శస్త్ర చికిత్సలు అవసరం అవుతుంది.

ప్రాథమిక వైద్యము తరువాత ఫిజియోథెరపి, ఆక్యుపేషనల్ థెరపి, స్పీచ్ థెరపి, డైటీషియన్, సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది.

నివారించడం ఎలా?

స్ట్రోక్ తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే జాగ్రత్తపడటం మంచిది. దీనికోసం అలవాట్టల్లో మార్పు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. రెగ్యులర్​ గా వ్యాయామం చేయాలి. ఆల్కాహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి.

About Author