PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొన ఊపిరితో ఉన్న శిశువుకు మెద‌డు శ‌స్త్రచికిత్స‌

1 min read

* జ్వరం త‌ర్వాత ఇన్ఫెక్షన్‌తో మెద‌డులో చీము

* అత్యవ‌స‌ర శ‌స్త్రచికిత్సతో తొల‌గించిన కిమ్స్ స‌వీరా వైద్యులు

* స‌మ‌యానికి చికిత్స చేయ‌డంతో త‌ప్పిన ప్రాణాపాయం

పల్లెవెలుగు వెబ్ అనంతపురం: దాదాపు కొన  ఊపిరితో ఉన్న ఓ చిన్నారికి అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్పత్రి వైద్యులు అత్యవ‌స‌రంగా మెద‌డు శ‌స్త్రచికిత్స చేసి, ప్రాణాలు నిల‌బెట్టారు. మామూలు జ్వరం నుంచి ఏకంగా మెద‌డులోకి ఇన్ఫెక్ష‌న్ చేర‌డంతో స‌మ‌స్య ఇంత వ‌ర‌కు వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించిన విష‌యాల‌ను, అందించిన చికిత్స వివ‌రాలను ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్టర్ ఎ. మ‌హేష్ తెలిపారు. “అనంత‌పురం న‌గ‌రానికి చెందిన ఏడు నెల‌ల పాప‌కు జ్వరం రావ‌డంతో తొలుత ద‌గ్గర్లోని ఆర్ఎంపీల‌కు చూపించారు. మందులు వాడినా త‌గ్గక‌పోవ‌డంతో త‌ర్వాత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొంత‌వ‌ర‌కు తగ్గింది గానీ, ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌రిస్థితి బాగోక‌పోవ‌డంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించారు, కానీ ఎంతకీ తగ్గకపోవడంతో కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. ఇక్కడ‌కు తీసుకొచ్చేస‌రికే పాప కొన ఊపిరితో ఉంది. వెంట‌నే ఆమెను వెంటిలేట‌ర్ మీద పెట్టి, మెద‌డులో ఏదో స‌మ‌స్య ఉంద‌న్న అనుమానంతో ముందుగా ఎంఆర్ఐ ప‌రీక్ష చేశాం. మా అనుమానం నిజ‌మైంది. పాప‌కు మెద‌డులో ఇన్ఫెక్షన్ కార‌ణంగా విప‌రీతంగా చీము చేరిపోయింది. వెంట‌నే ఈ విష‌యాన్ని న్యూరో స‌ర్జరీ బృందానికి తెలియ‌జేశాం. వాళ్లు వ‌చ్చి, అవ‌స‌ర‌మైన ఇత‌ర ప‌రీక్షలు చేసుకుని వెంట‌నే శ‌స్త్రచికిత్సకు సిద్ధమ‌య్యారు. పాప‌కు క్రేనియాట‌మీ విత్ ఆబ్సెస్ డ్రైనేజ్ అనే శ‌స్త్రచికిత్స చేశారు. ఇందుకోసం జుట్టు తొల‌గించి, పైన చ‌ర్మం క‌త్తిరించి, ఎముక‌ను తీసి అప్పుడు లోప‌ల ఉన్న చీము మొత్తాన్ని శుభ్రం చేశారు. శ‌స్త్రచికిత్స అయిన త‌ర్వాత దాదాపు నాలుగు వారాల పాటు పాప‌ను ఆస్పత్రిలోనే ఉంచి కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అన్ని ర‌కాలుగా పాప బాగుండ‌టంతో  ఇటీవ‌లే డిశ్చార్జి చేశాం. అస‌లు మొద‌ట్లో జ్వరం రాక ముందు కంటే కూడా ఇప్పుడు పాప ఇంకా చురుగ్గా ఉంద‌ని పాప త‌ల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్న పిల్లల‌కు జ్వరం లాంటివి వ‌చ్చిన‌ప్పుడు స‌రైన పిల్లల వైద్య నిపుణుల‌కు చూపించాలి. జ్వరం త‌గ్గిన త‌ర్వాత కూడా పిల్లలు ఒక‌వేళ నీర‌సంగా ఉంటూ, అదేప‌నిగా నిద్రపోతుంటే త‌ప్పనిస‌రిగా త‌ల్లిదండ్రులు అప్రమ‌త్తం కావాలి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మెద‌డుకు, శ‌రీరం మొత్తానికి కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఏ వ‌య‌సులో ఉండే పిల్లలు ఆ వ‌య‌సుకు త‌గ్గట్లు చురుగ్గా ఉండ‌క‌పోతే ఏదో స‌మ‌స్య ఉంద‌ని గుర్తించి, త‌గిన వైద్యుల‌ను సంప్రదించాలి” అని డాక్టర్ ఎ.మ‌హేష్ వివ‌రించారు.

About Author