బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
1 min readటెలికం సలహా కమిటీ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కు సూచించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఏలూరు జీ.ఎన్.టీ రోడ్ లో గల బీఎస్ఎన్ఎల్ భవన్ లో గురువారం జరిగిన టెలికం సలహా కమిటీ సమావేశానికి ఎంపీ మహేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలను జనరల్ మేనేజర్ శ్రీను వివరించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బిఎస్ఎన్ఎల్ టవర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో కొత్త టవర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత వల్ల కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నాయని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ శ్రీను ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల ఖాళీల వివరాలు, ఇతరత్రా సమస్యలు తనకు నివేదిక రూపంలో అందిస్తే కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కొత్త టవర్ల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సలహా కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని ఎంపీ సూచించారు. అనంతరం బిఎస్ఎన్ఎల్ అధికారులు, కమిటీ సభ్యులు ఎంపీ మహేష్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి సన్మానించారు. సమావేశానికి సలహా కమిటీ సభ్యులు, బిఎస్ఎన్ఎల్ అధికారులు హాజరయ్యారు.