గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన కాల్షియం
1 min read* వృద్ధుని గుండె సమస్యకు అత్యాధునిక చికిత్స
* తొలిసారిగా రోటాప్రో రోటాబ్లేషన్ వినియోగం
* కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వైద్యుల ఘనత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : గుండె కవాటాల్లో గట్టిగా పేరుకుపోయిన కాల్షియంను తొలగించాలంటే అంత సులభం కాదు. గతంలో దీనికి బెలూన్ ఆధారిత చికిత్సలు కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అత్యాధునికంగా రోటాప్రో రోటాబ్లేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి వచ్చింది. 73 సంవత్సరాల వృద్ధునికి ఉన్న సమస్యను కిమ్స్ హాస్పిటల్ కర్నూలుకి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తోట నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. “73 ఏళ్ల వృద్ధునికి చాలా తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. దాంతో ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించి చూస్తే అతనికి లోపల కాల్షియం చాలా ఎక్కువస్థాయిలో పేరుకుపోయింది. అతని వయసు ఎక్కువ కావడం, ఇతర సమస్యలు కూడా ఉండటంతో సాధారణ యాంజియోప్లాస్టీ మరియు బైపాస్ సర్జరీ చేయడం కుదరదు. దాంతో అతనికి అత్యాధునిక పద్ధతి అయిన రోటాప్రో రోటాబ్లేషన్ చికిత్స చేశాం. ఇది సరికొత్త టెక్నాలజీ. ఇంతకుముందు కూడా రోటాబ్లేటర్లు ఉన్నా, వాటిని కాలితో పెడల్ తొక్కడం ద్వారా పనిచేయించాల్సి వచ్చేది. రోటాప్రో సిస్టంను చేత్తోనే పనిచేయించవచ్చు. దీనికి ముందు వజ్రంతో చేసిన టిప్ ఉంటుంది. దానివల్ల అత్యంత సంక్లిష్టమైన వాటిని కూడా చాలా సులభంగా చెక్కుతూ అత్యంత కచ్చితత్వంతో పూడికను తొలగిస్తుంది. దానివల్ల రోగికి ఆరోగ్యపరమైన భద్రత మరింత పెరుగుతుంది. గతంలో ఉన్న కటింగ్ బెలూన్, స్కోరింగ్ బెలూన్, అల్ట్రా హైప్రెషర్ బెలూన్, లిథోట్రిప్సీ, అబ్లేటివ్ టెక్నిక్స్ కంటే ఇది చాలా మెరుగైనది. కొత్త రోటాప్రో సిస్టం వల్ల ప్రొసీజర్ చేసే సమయం, ఫ్లూరోస్కొపీ సమయం, కాంట్రాస్ట్ పరిమాణం, రేడియేషన్ డోస్ అన్నీ తగ్గుతాయి. వీటన్నింటి వల్ల కూడా రోగికి మెరుగైన ఫలితాలు ఉంటాయి” అని తెలిపారు. ఇంకా, అసలు కాల్షియం పూడికలు ఏర్పడటానికి కారణాలు, దాన్ని నివారించుకునే చర్యలను కూడా ఆయన వివరించారు. అవి..
కాల్షియం పూడిక ఎందుకు వస్తుంది?
గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవడం అనేది పెద్దవయసువారిలో సర్వసాధారణం. దాదాపు 40 ఏళ్ల వయసు నుంచే కాల్షియం పేరుకోవడం మొదలవుతుంది. దానికితోడు అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ స్థాయి పెరుగుతుండటం, ఊబకాయం, దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి వల్ల కూడా ఇది మరింత ఎక్కువ అవుతుంది. పొగాకు వాడకం వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు చాలా త్వరగా ఏర్పడతాయి.
ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు ఎలా?
రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు వైద్యులు సూచించిన మందులు వాడాలి. కొలెస్టరాల్‌ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. వేపుళ్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు మానేయాలి. మధుమేహం ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే గుండె రక్తనాళాల్లో కాల్షియం పూడిక ఏర్పడకుండా ఉంటుంది.
* గుండెకు మేలుచేసే ఆహారం తీసుకోవాలి
* ధూమపానం, మద్యపానం మానేయాలి
* తగిన వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉండాలి
* బరువు అదుపులో పెట్టుకోవాలి.