27 దళిత సంక్షేమ పథకాలు రద్దుచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
1 min readమాజీ మంత్రి కె.ఎస్ జోహార్
దళితులంతా సైకిల్ గుర్తు పై ఓటేసి గెలిపించాలి
ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి బడేటి చంటి విజయానికి కారకులవ్వలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దళితులకు గత టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కెఎస్ జవహర్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి, టిడిపి ఎస్సీసెల్ రాష్ట్ర నాయకులు దాసరి ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ చర్యతో ఆయన దళితుల సంక్షేమాన్నే తుంగలో తొక్కినట్లైందని దుయ్యబట్టారు. ఏలూరు పవర్‌పేటలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్, వైసిపి నాయకులు అవలంభిస్తోన్న తీరును ఎండగట్టారు. స్వాతంత్య్రానంతరం ఏర్పడిన స్వీయ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంతగా వైసిపి ఐదేళ్ళ పాలనా కాలం దళితుల జీవితాల్లో చీకటి రోజులుగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. నియంత ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళితులకు తొలి నుండి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీయేనని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణపాలనతో పాటూ దళితుల కోసం గత టిడిపి ప్రభుత్వం అమలు సంక్షేమ పథకాలు తిరిగి పురుడు పోసుకోవాలంటే దళితులంతా సమిష్టిగా కూటమి విజయానికి కంకణం కట్టుకోవాలని వారు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులకు సంపూర్ణ మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ వైస్ ఎంపీపీ లంకలపల్లి మాణిక్యాలరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు కందుల రమేష్, టిడిపి నాయకులు జుంజు మోజేష్, పెద్దాడ రమణ, ఎస్సీ సెల్ నాయకులు జలా బాలాజీ, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.