పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్లు…
1 min readఅన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు
సామాన్య ,పేద,మధ్యతరగతి వారిలో వెల్లు విరిసిన ఆనందం
ఐదురూపాయలకే అన్నా క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: పేదల ఆకలితీర్చేందుకు అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకుని అన్నార్తులకు అండగా ఉండడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రావడంతో పేద, సామాన్య తరగతి ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. పేదలకు మూడుపూటలా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర పౌండేషన్ వంటశాలకు అప్పగించింది. ప్రస్తుతం ఏలూరు నగరంలో ఇండోర్ స్టేడియం, ఆర్ఆర్.పేట,తంగెళ్లమూడి, రామకోటి ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన అన్న క్యాంటీన్లు పేద, సామాన్య ప్రజలతో కళకళలాడుతున్నాయి. పేద ప్రజల కడుపునింపుతున్న అన్న క్యాంటీన్లకు పూట పూటకు ప్రజాదరణ పెరుగుతూ ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. అన్న క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం రుచికరంగా ఉన్నాయని, కేవలం నామమాత్రపు ధరకే వీటిని అందించడం వల్ల పేద, సామాన్య వర్గాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం కేవలం రూ. 5/-లకే అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వీటిలో ఏదైన ఒకటి అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడితో కేవలం రూ. 5/-లకే అందిస్తున్నారు. అన్న క్యాంటీన్ లో ఉదయం 7.30 గంటల నుంచి రూ. ఉ.10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం, తిరిగి రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు రాత్రిపూట భోజనం వడ్డిస్తున్నారు.ప్రతి అన్న క్యాంటీన్ లో ఉదయం పూట అల్పాహారం సుమారు 200 మందికి అందిస్తుండగా మద్యాహ్నం 300 మందికి, రాత్రిపూట 300 మందికి భోజనాలు వడ్డిస్తున్నారు. ఒకోక్కరికి మూడు పూటలా భోజనం ఖర్చు రూ.90/-లు కాగా ఇందులో రూ. 15/-లు వసూలు చేస్తూ మిగిలి రూ.75/-లు ప్రభుత్వం సబ్సీడిగా అందిస్తొంది.
భీమడోలు మండలం, ఆగడాలలంకకు చెందిన సైదు జ్యోతి మాట్లాడుతూ ఏలూరులో వైద్య చికిత్సకోసం వచ్చానని అన్నా క్యాంటీన్ లో రుచికరమైన భోజనం చేశామన్నారు. తమలాంటి పేదలకు ఇటువంటి సదుపాయం లేకపోతే బయట రూ. 100/-లు నుంచి రూ.150/-లు భోజనానికి ఖర్చు అయ్యేదన్నారు. అన్న క్యాంటీన్ లో భోజనం రుచికరంగా ఉండటంతోపాటు నాణ్యతగా ఉందన్నారు. కేవలం రూ.5/-లకే భోజనం దొరకడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ద్వారకాతిరుమల మండలం, సత్తెనగూడెం గ్రామానికి చెందిన రాజప్రోలు సుగుణరావు (64) అన్న క్యాంటీన్లో భోజనం చాలా బాగుందని, అన్నము, సారకాయ- క్యారెట్ సాంబారు వేశారని, పెరుగు, నిమ్మకాయ పచ్చడి అంతా రుచికరంగా ఉన్నాయని చెప్పారు. తనలాంటి పేదలకు కేవలం రూ.5/- ల చొప్పున ఉదయం అల్పాహారం, రెండు పూటలా అన్నం పెట్టి ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ద్వారకాతిరుమల మండలం, , కోడిగూడెం గ్రామానికి చెందిన డొక్కు రత్నం మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల వల్ల పేదవారికి మేలు జరుగుతుందన్నారు. చిరు వ్యాపారస్తులకు బయట పనుల మీద వచ్చివెళ్లే పేదలకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. బయట టిఫిన్ చేయడానికి రూ. 30/-లు అవుతున్న సమయంలో కేవలం రూ. 5/-లకే భోజనం అంటే చాలామంచి కార్యక్రమం అన్నారు. కూలిపనులు, చిరువ్యాపారస్తులకు అంతోఇంతో దీనిమూలంగా డబ్బులు కూడా ఆదాఅవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చాలా పనిచేస్తుందని ఆమె అన్నారు. కరప సత్యనారాయణ, వరలక్ష్మి దంపతులు కామవరపుకోట మండలం, తడికెలపూడి గ్రామం నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బందువును పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ సందర్బంగా ఏలూరు కలెక్టరేట్ సమీపంలోని అన్న క్యాంటీన్ లో మధ్యాహ్నం పూట వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు,పచ్చడితో కేవలం రూ. 5లకే అందిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లి భోజనం చేశామన్నారు. తమలాంటి పేదవారికి ఇంత తక్కువ ధరకే నాణ్యమైన భోజనం దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ధర్మాజీగూడెం కు చెందిన కర్రా శంకరరావు అన్న క్యాంటీన్ లో అల్పాహారం చేస్తూ ఎంతో రుచికరంగా ఉండటంతోపాటు కేవలం రూ. 5/-లకే అల్పాహారం దొరకడం తమలాంటి వ్యవసాయ కూలీలకు ఎంతో ఉపయోగం అన్నారు. తాను ఏలూరుకు సొంతపనిపై ఉదయం రాగానే అల్పాహారం తిందామని చూస్తే బయట ఉన్నధరలు చూసి టిఫిన్ తినడంపై కొద్దిగా అలోచనలోపడ్డానని ఈ సమయంలో ఆర్.ఆర్. పేటలోని వెంకటేశ్వరస్వామి గుడివద్ద వున్న అన్నాక్యాంటీన్ లో అల్పాహారం అందించడం గమనించి అక్కడివెళ్లి రూ.5/-లకే అల్పాహారం తీసుకున్నానన్నారు.