లక్ష్యం మేరకు సీసీఆర్సీ కార్డులను వేగవంతంగా అందచేయాలి
1 min readఅగ్రి టెస్టింగ్ ల్యాబ్ ల్లో పరీక్షల శాతం మరింతగా పెరగాలి
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను వేగవంతంగా అందచేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, హార్టికల్చర్, ఎపిఎంఐపి కార్యకలాపాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీసీఆర్సీ కార్డులు జిల్లాకు 22235 లక్ష్యం కాగా ఇప్పటివరకు వంద కార్డులు అందచేశారని, సీజన్ తర్వాత ఇచ్చి లాభమేంటి అని అధికారులను ప్రశ్నించారు..ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ నుండి కూడా ఆదేశాలు వచ్చాయని, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి త్వరితగతిన వీటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా కేవలం 308 పరీక్షలే చేశారని, వీటి సంఖ్య చాలా పెరగాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.. సీజన్ కు ముందే ఈ పరీక్షలను మొదలు పెట్టాలని, ముఖ్యంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లి టెస్టులు చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. వేరుశనగ విత్తనాలకు డిమాండ్ ఉన్నందున అవసరమైన పరిమాణంలో విత్తనాల సరఫరా కోసం వ్యవసాయ శాఖ కమిషనర్ కు డి.ఓ లెటర్ పెట్టాలని డిఏవో ను కలెక్టర్ ఆదేశించారు.పిఎం కిసాన్ కు సంబంధించి సోమవారం నాడు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, కారణమేంటి అని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు..ఫిబ్రవరి 2019 కి ముందు భూమి ఉన్నవారికి మాత్రమే పిఎం కిసాన్ కు అర్హత ఉందని అధికారులు తెలిపారు.. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా తెలియచేయాలని కలెక్టర్ సూచించారు..ఈ క్రాప్ లో పొందుపరుస్తున్న వివరాల గురించి కలెక్టర్ అధికారులను ఆరా తీశారు…ఈ క్రాప్ లో ఏ వివరాలు ఉండాలి అన్న విషయాలపై అధికారులకు అవగాహన కల్పించడం కోసం 2015 లో ఈ క్రాప్ కు సంబంధించి తాము రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను కలెక్టర్ ప్రదర్శించారు.. ఈ క్రాప్ లో వ్యవసాయ శాఖ ద్వారా రైతు పొందిన లబ్ధి వివరాలు, క్రాప్ లోన్ వివరాలు, ఇరిగేషన్ సోర్స్, సర్వే నంబర్, విస్తీర్ణం, పట్టాదారు, పంటల వారీగా నివేదిక తదితర వివరాలన్నీ జిల్లా,మండలం, గ్రామం వారీగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు…ఇలా చేయడం వల్ల పిఎం కిసాన్ లాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. అదే విధంగా రైతు భూమిలో ఏ పంట వేశాడు ? ఒకవేళ పంటనష్టం జరిగి ఉంటే అందుకు తగిన నష్టపరిహారం రైతు ఖాతాలో జమ అయ్యిందా లేదా అనే వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ యాప్ ను కుప్పంలో పైలట్ ప్రాజెక్టు తరహాలో తయారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సదరు యాప్ వివరాలను అధికారులకు వివరించారు.కేంద్ర ప్రభుత్వం చే అమలు చేస్తున్న సంపూర్ణతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మూడు మండలాల్లో గుర్తించిన సూచికలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో పండించే పంటలకు సంబంధించి అన్నీ జిల్లాలోనే వినియోగిస్తున్నారా ? లేకా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ఏమైనా ఎగుమతి చేస్తున్నారా అన్న అంశంపై ఒక విశ్లేషణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, సాధారణ వ్యవసాయం పోల్చుతూ కంపారిటివ్ స్టేట్మెంట్ ను తయారుచేయాలని కలెక్టర్ ఆదేశించారు.. నాచురల్ ఫార్మింగ్ ఎంతవరకు ఉపయోగం అని తెలియాలంటే ఈ నివేదిక అవసరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.. ప్రకృతి వ్యవసాయం, రసాయనాలతో పండించిన పంటలకు తేడాను సూచిస్తూ వాటికయ్యే పెట్టుబడి, దిగుబడి, ఆదాయం, సాయిల్, నీటి వనరులు తదితర అన్ని వివరాలతో ఈ నివేదికను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎపిఎంఐపికి సంబంధించి ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. DRDA, DCO లతో సమావేశం నిర్వహించి సహకార పరపతి సంఘాల కు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎపిఎంఐపి పిడి ని ఆదేశించారు.. అదే విధంగా ఉల్లిపంట స్టోరేజ్ కి సంబంధించిన ఉడెన్ బేస్డ్ స్ట్రక్చర్స్ ను డ్వామా లో మెటీరియల్ కంపోనెంట్ కింద నిర్మించే వెసులుబాటు ఉంటుందా అని ఉన్నతాధికారులకు లేఖ రాయాలని హార్టికల్చర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఎపిఎంఐపి పిడి ఉమాదేవి, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు.