PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

78వ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించండి

1 min read

జిల్లా అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:   జిల్లాలో ఈనెల 15వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు  ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్   ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై  అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలందరిలో దేశభక్తి భావాలు పెంపొందించేలా స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లను చేయాలన్నారు. కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, బ్యాక్ డ్రాప్, విఐపి సీటింగ్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ చూపాలని ఆర్డీఓ, పోలీసు అధికారులను ఆదేశించారు. దేశభక్తి ఉట్టిపడేలా  ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిఇఓ, ట్రైబల్ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయం, డిఆర్డిఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమం తదితర అన్ని సంక్షేమ శాఖలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శనలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ  ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులకు అప్పగించిన విధులను చివరి వరకు వుండకుండా ముందస్తుగా పూర్తి చేసుకోవాలని జేసీ సూచించారు. జిల్లా అభివృద్ధిపై సందేశ బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను సూచించారు. ఆహ్వాన పత్రికలను ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే పంపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల జారీకి జాబితాను సిద్ధం చేయాలని డిఆర్ఓ ను ఆదేశించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ ఎ. పద్మజ, ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి తదితర జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author