ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు
1 min readనివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెసి పి. ధాత్రిరెడ్డి
విద్యార్థులు సమాజ శ్రేయస్సుకు దోహదపడేందుకు విద్య తోడ్పడుతుంది
విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భారత స్వాతంత్ర్య సమర యోధుడు,భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్బంగా నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్బంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు,జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఏస్.కృపవరం,డిఈవో వెంకటలక్ష్మీ, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడారు. విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. విద్యకు ఎంతో విలువుందని, అటువంటి విద్యావ్యాప్తికి అబుల్ కలాం ఆజాద్ ఎంతో పాటుపడ్డారన్నారు. వారి కలను సాకారం చేసేందుకు బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో ఉండేలా అందరూ కృషిచేయాలన్నారు. వారిని సమాజంలో విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనఅందిరిపై ఉందని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందన్నారు.