ఘనంగా హిందీ భాషా పక్షోత్సవ వేడుకలు
1 min readభారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం ఉలిందకొండ జిల్లా పరిషత్ హైస్కూల్ లో నిర్వహణ
భారతీయులను హిందీ భాష సంఘటితంగా నిలిపి ఉంచుతుంది
మాతృభాష తెలుగుతో పాటు ప్రతి ఒక్కరూ హిందీలో ప్రావీణ్యత సాధించాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హిందీ భాషా పక్షోత్సవ వేడకలు కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలింద కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఘనంగా జరిగాయి. హిందీ భాషా దినోత్సవం (సెప్టెంబర్ 14) సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన పక్షోత్సవాలను భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కార్యాలయం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హిందీ భాషకు సంబంధించి పలు పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు.ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి లీలావతి మాట్లాడుతూ హిందీ భాష భారతీయులందరినీ సంఘటితంగా నిలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. హిందీ నేర్చుకోవటం ద్వారా దేశంలో ఎక్కడైనా మన భవిష్యత్ ను సులభంగా అభివృద్ధి పథంలో సాగించవచ్చని పేర్కొన్నారు.రాజభాష పాఠశాల హిందీ ఉపాధ్యాయిని శ్రీమతి పద్మలత మాట్లాడుతూ, మాతృభాష తెలుగుతో పాటు జాతీయ భాష అయిన హిందీని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నేర్చుకోవాలని సూచించారు. తెలుగు సాహిత్యంలో మనవైన సంస్కృతి సంప్రదాయాలు ఎలా దాగి ఉన్నాయో, అదేవిధంగా హిందీ ద్వారా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంస్కృతులను అర్థం చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో భారతప్రభుత్వ క్షేత్ర ప్రచార సహాయకులు శ్రీ ఫణికుమార్, పాఠశాల హిందీ ఉపాధ్యాయిని శ్రీమతి గౌరి సుభాషిణి, స్కూల్ అసిస్టెంట్ శ్రీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.