ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు మన్మోహన్ సింగ్- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని అన్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్గా,ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టి, సంక్షోభం నుంచి గట్టెక్కించడమే కాకుండా, ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందని టీజీ వెంకటేష్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే, రాయలసీమకు జరిగే అన్యాయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వివరిస్తే దానికి ఆయన స్పందిస్తూ.. వెనుకబాటుకు గురైన రాయలసీమకు అన్యాయం జరగనీయమని, అప్పట్లో ఆయన హామీ ఇచ్చారని టీజీ తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక కోరిన ప్రజలు పలు డిమాండ్లను నెరవేర్చి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని మన్మోహన్ నిరూపించుకున్నారని టీజీ వెంకటేష్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశమే కాకుండా , ప్రపంచం కూడా ఒక అత్యుత్తమ ఆర్థిక వ్యక్తను కోల్పోయిందని టీజీ వెంకటేష్ అన్నారు.