బీసీలను నమ్మించి మోసం చేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
1 min readఇక ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదు
టిడిపి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపణ
గౌడ,శెట్టిబలిజ, శ్రీశయన, ఈడిగా, ఆత్మీయ సదస్సు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు పితాని సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరులో గౌడ సమాఖ్య ఆధ్వర్యంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీ శయన, ఈడిగ ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి, టిడిపి నాయకులు పితాని సత్యనారాయణకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సదస్సు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పితాని విరుచుకుపడ్డారు. తొలుత నిర్వహించిన సదస్సులో ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ వైసిపి పాలనలో దౌర్జన్యం, దోపిడి, లూటీలు పెరిగిపోయాయని, ఈ తరుణంలో ధర్మం వైపు ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరోసారి సిద్దమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని సూచించారు. జనసేన ఏలూరు ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలతో పాటూ ప్రతిపక్షాల గొంతునొక్కే విధంగా వైసిపి రాక్షస పరిపాలన ఉందని, దీన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎమ్మార్డీ బలరాం, పలువురు గౌడ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.