ఇసుక ర్యాంపుల వద్ద ఇసుక అక్రమ రవాణాకు చెక్
1 min readఇసుక ర్యాంపుల వద్ద సిసి కెమెరాలు, 24 గంటలపాటు రెవిన్యూ సిబ్బంది నిఘా
ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు,వాహనాలు సీజ్ ఐటిడిఏ పీఓ సూర్యతేజ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఇసుక ర్యాంపులలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఐ.టి.డి. ఏ ., ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ చెప్పారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. కుక్కునూరు మరియు వేలేరుపాడు మండలాలలోని దాచారం, వింజరం, ఇబ్రహీంపట్నం లోని 2 రీచ్ లు, రుద్రమకోట గ్రామం నందు 2 రీచ్ లలో సోలార్ విధానంతో పనిచేసే సిసి కెమెరాలు ఏర్పాటుచేయడంతోపాటు, రెవిన్యూ సిబ్బందిని కూడా 24 గంటలపాటు నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, వాహనాలను కూడా సీజ్ చేస్తామని ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ హెచ్చరించారు.