పౌరులు నైపుణ్యం లో ప్రతిభ కనబరచాలి
1 min read– నైపుణ్యం గల పౌరులకు భవిష్యత్తు ఉంటుంది -ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రతిభగల ప్రతి పౌరుడు తన వృత్తి లో నైపుణ్యత కనపరచాలని అందుకు తగినటువంటి శిక్షణను ప్రభుత్వం అందించడమే కాకుండా వారికి ప్రోత్సాహం అందిస్తుందని అర్హత గల పౌరులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యవృద్ది సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నైపుణ్యగణన- 2024-2025లో భాగంగా మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఎంపీడీవో ఆధ్వర్యంలో స్థానిక సభా భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్యం గల పౌరులు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి నైపుణ్యం కలవారు ఉన్నారు, అనే విషయాలపై ఇటీవలే అమరావతి, విజయవాడలో పూర్తి చేశారన్నారు. అలాగే మండల స్థాయిలో పౌరులు ఎటువంటి విద్యార్హతలు కలిగి ఉన్నారో ,ప్రస్తుత ఉద్యోగస్థితి ,ఇతర స్థితి గతులు ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే నైపుణ్యం గల వారి డేటాను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌరులకు మంచి ఉపయోగాలతో పాటు,మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ,పనులలో వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఇందులో స్వతహాగా ఎవరికి వారే లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.