PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొక్కలతో వాతావరణ సమతుల్యం..

1 min read

నగరంలో 400 మామిడి, నేరేడు, జామ, వంటి తదితర మొక్కల నాటేందుకు శ్రీకారం

కుటుంబసమేతంగా మొక్కలునాటే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పర్యావరణ సమతుల్యానికి, ప్రజల ఆరోగ్యకరమైన నగర వాతావరణాన్ని నిర్వహించేందుకు మొక్కలు నాటి పెంచడం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. నగరంలోని.  తంగెళ్లమూడి-జంగారెడ్డిగూడెం రోడ్డు, సి.ఆర్.ఆర్. కళాశాల వద్ద, అశోక్ నగర్ ,పంపుల చెరువు తదితర ప్రాంతాల్లో కుటుంబసమేతంగా పాల్గొన్న కలెక్టర్ దంపతులు వె. ప్రసన్న వెంకటేష్, డా. మానస, వారి పిల్లలతో కలిసి మొక్కలు నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యంను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. వృక్షాలు నగరంలో కేవలం ఆకర్షణియమైన కాకుండా వాతావరణ నియంత్రణకు గణనీయంగా దోహదపడతాయన్నారు.  నీడనందించడం ద్వారా అవి అర్బన్ హాట్ ఐలాండ్ ప్రభావాన్ని ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయన్నారు.  అంతేగాకుండా చెట్ల ఆకులు, కార్బన్ డయాక్సైడ్ ను కూడా గ్రహిస్తాయని తద్వారా గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు దోహదపడతాయన్నారు. అదే విధంగా వర్షపాతాన్ని సంగ్రహించడంతోపాటు నేలకోతను తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఫల రకాల మొక్కలు నాటడం మూలంగా అవి పెరిగన అనంతరం పక్షులకు ఆహారాన్ని అందించేందుకు దోహదపడతాయన్నారు.  ఏలూరు నగరంలో మామిడి, జామ, నేరేడు వంటి ఫల రకాల మొక్కలతోపాటు రావి, తదితర 400 మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఇందుకు అయ్యే ఖర్చును తమ కుమారుని రుద్రాన్ష్ సాయి మణికంఠన్ జన్మదినోత్సవం సందర్బంగా తాము అందిస్తున్నట్లు చెప్పారు.  వీటికి ట్రీగార్డ్స్ అమర్చి పెంపకం విషయంపై స్ధానిక అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

జిల్లా కలెక్టర్ సతీమణి డా. మానస మాట్లాడుతూ వివిధ జీవరాసుల ఆకలి తీర్చేదిశగా పండ్ల మొక్కలను పెంచడం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇటువంటి మంచి భావన తమ కుమారుడులో చిన్నతనం నుండే అలవాటు చేయాలనే తలంపుతో తన కుమారుడు రుద్రాన్ష్ సాయి మణికంఠన్ పుట్టినరోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పలు రకాల చెట్లు పక్షులకు నిర్ధిష్ట ఆహార అవసరాలను తీర్చడంతోపాటు పునరుత్పత్తి మరియు వృద్ధి చెందడానికి సహాయ పడతాయని ఆమె పేర్కొన్నారు. చెట్ల కొమ్మలు, ఆకులు పక్షులకు సురక్షితమైన స్వర్గదామాలను అందిస్తాయన్నారు.కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పామణి, ఏలూరు ఆర్డిఓ ఎన్ ఎస్ కె. ఖాజావలి, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, అడిషనల్ కమిషనర్ చంద్రయ్య , డ్వామా పిడి ఎ. రాము, డిఎఫ్ఓ శైలజ, హెల్త్ ఆఫీసర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.

About Author