ఆరోగ్యంగా ఉన్న యువకులు ముందుకు వచ్చి ప్లేట్లెట్స్ దానం చేయాలి
1 min readసమయానికి ప్లేట్లాట్స్ దొరకకపోతే ప్రాణానికే ముప్పు
రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రస్తుతం టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ను సందర్శించి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మిషన్ ను పరిశీలించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల బారిన పడిన వారికి రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ దాతల కొరత ఏర్పడుతుందని, సమయానికి ప్లేట్లెట్స్ దాతలు దొరకకపోతే ప్రాణాలకే ప్రమాదవని, కాబట్టి ఆరోగ్యంగా, ఉన్న యువకులు ముందుకు వచ్చి అవసరమైన వారికి ప్లేట్లెట్స్ దానం చేయవలసిందిగా కోరారు. స్వచ్ఛందంగా ప్లేట్లెట్స్ దానం చేయదలచిన దాతలు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ 08812224722 ను సంప్రదించవచ్చునని తెలిపారు. డెంగ్యూ ,టైఫాయిడ్ వ్యాధులు బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని, డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం నీరని, కాబట్టి ఇల్లు, పరిసర ప్రాంతాల్లో నీరును నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎవరైనా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల మరియు కండరాల నొప్పి,కళ్ళ వెనుక నొప్పి, వాపు శోషరస కణుపులు, వికారం, వాంతులు , దద్దుర్లు, అలసట వంటి లక్షణాలను కలిగి ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంబంధిత పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాలని కృష్ణారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, డాక్టర్ జి స్పందన, పి ఆర్ ఓ కే వి రమణ తదితరులు పాల్గొన్నారు.