ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభం
1 min readరాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 1,48,149 మంది విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు చేస్తూ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.శనివారం స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ కార్యక్రమంలో తాను భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి వరకు అమలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతోందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు అవుతోందన్నారు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరం నుండి 86 కోట్ల రూపాయలను ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు..ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే 1,63,750 మంది విద్యార్థినీ, విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని సీఎస్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా మేధో శక్తి, శారీరక బలంతో పాటు మానసిక వికాసం కలిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.. కర్నూలు జిల్లాలో ఉన్న 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 8678 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు.రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 398 జూనియర్ కళాశాలలు మధ్యాహ్న భోజనం అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానమై ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడే నాణ్యత కలిగిన భోజనాన్ని తయారు చేసి సరైన సమయానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పంపిస్తారన్నారు..మిగిలిన 77 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్ పాల్, డిఎస్పీ మహబూబ్ బాషా, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కల్లూరు తహశీల్దార్ ఆంజనేయులు, కర్నూలు అర్బన్ తహశీల్దార్ వెంకటలక్ష్మి, డివిఈఓ వై.పరమేశ్వర రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సరళ దేవి, ఒకేషనల్ కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ నాగస్వామి, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.