PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు రాష్ట్రాల్లో థలసేమియా చికిత్సలకు సమగ్ర క్లినిక్

1 min read

ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో ఏర్పాటు   అందరికీ అందుబాటులో థలసేమియా చికిత్సలు

తల్లిదండ్రులకు పరీక్షలు, జన్యు కౌన్సెలింగ్ కూడా..    రక్తమార్పిడి, మూలుగ మార్పిడి సదుపాయాలు జాతకాలతో పాటే థలసేమియా పరీక్షలూ చేయించాలి   హెమటాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సచిన్ జాదవ్ సూచన

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : థలసేమియా.. అత్యంత ప్రమాదకరమైన జన్యుసమస్య. మన రక్తంలోని ఎర్ర రక్త కణాలకు సంబంధించిన వ్యాధి ఇది. ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. థలసేమియా క్యారియర్ (మైనర్), థలసేమియా పేషెంట్ (మేజర్). తల్లిదండ్రుల నుంచే పిల్లలకు సంక్రమించే ఈ వ్యాధిలో విపరీతమైన అలసట, నీరసం, చర్మం పాలిపోవడం, ముఖం ఆకారంలో మార్పులు, ఎదుగుదల లేకపోవడం, పొట్ట వాపు, మూత్రం ముదురు రంగులో రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఇద్దరికీ థలసేమియా మైనర్ ఉంటే వారికి పుట్టే పిల్లలందరికీ థలసేమియా మేజర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి గురించిన అవగాహన, జన్యు కౌన్సెలింగ్, చికిత్సలు అన్నీ అందించే సమగ్ర క్లినిక్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రికి చెందిన హెమటాలజీ, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ విభాగాధిపతి, ఇంటర్నేషనల్ హెమటాలజీ కన్సార్షియం ఛైర్మన్ డాక్టర్ సచిన్ జాదవ్ ఇందుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. “థలసేమియాను ముందుగానే గుర్తించగలం. పెళ్లికి ముందు మన దేశంలో జాతకాలు చూపించే అలవాటు చాలామందికి ఉంటుంది. నిజానికి దాంతోపాటే కాబోయే వధూవరులిద్దరికీ థలసేమియా పరీక్షలు కూడా చేయించాలి. ఒకవేళ ఇద్దరిలో ఒకరు గానీ, ఇద్దరూ గానీ థలసేమియా క్యారియర్లు అయితే ముందుగానే జన్యుకౌన్సెలింగ్ తీసుకోవడం చాలా ముఖ్యం. దానివల్ల భవిష్యత్తులో పుట్టే పిల్లలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఒకవేళ ఆ దశలో పరీక్షలు చేయించకపోయినా, గర్భం దాల్చినప్పుడైనా చేయాలి. భార్యకు థలసేమియా మైనర్ ఉందని తెలిస్తే అప్పుడు భర్తనూ పరీక్షించాలి. ఇద్దరికీ ఉంటే 15-16 వారాల సమయంలో పిండానికి కూడా పరీక్షలు చేస్తాము. ఒకవేళ పుట్టే బిడ్డకు థలసేమియా మేజర్ ఉంటుందని తెలిస్తే, ఆ సమయంలోనే తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి గర్భస్రావం చేయించుకోవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత 5-6 నెలల వరకు ఎలాంటి సమస్య ఉండదు. ఆ తర్వాత హెమోగ్లోబిన్ 4-5 గ్రాములకు పడిపోతుంది. అప్పుడు పిల్లల వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్తే పరీక్షించి రక్తం ఎక్కిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి నెలకు ఒకటి నుంచి రెండుసార్లు ఇలా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ పదే పదే రక్తం ఎక్కిస్తే శరీరంలో ఐరన్ స్థాయి ఎక్కువైపోయి గుండె, కాలేయం, క్లోమం దెబ్బతింటాయి. ఐరన్ తగు స్థాయిలోనే ఉండేందుకు మందులు వాడాలి. సమీప బంధువులకు హెచ్ఎల్ఏ పరీక్ష చేసి, అది మ్యాచ్ అయితే మూలకణ మార్పిడి చేయొచ్చు. అప్పుడు రక్తమార్పిడి మరీ అంతగా అవసరం ఉండదు.

ఉచితంగా హెచ్ఎల్ఏ పరీక్ష

థలసేమియా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే దీనిపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మేం ఇప్పటికే పలు అవగాహన శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తున్నాం. అనేకమందికి ఉచితంగా పరీక్షలు కూడా చేస్తున్నాం. జర్మనీ ఫౌండేషన్ సాయంతో ఉచితంగా హెచ్ఎల్ఏ పరీక్షలు సైతం చేస్తున్నాం. దీనికి ఒక్కొక్కరికి దాదాపు రూ.15 వేలు అవుతుంది” అని డాక్టర్ సచిన్ జాదవ్ వివరించారు. థలసేమియా క్లినిక్ను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా డాక్టర్ సచిన్ జాదవ్తో పాటు పీడియాట్రీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎస్. నరసింహారావు, కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కంచన్ ఎస్. చన్నావర్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఇంకా కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, నియోనాటాలజిస్టు డాక్టర్ ఆర్.వి. సౌజన్య, కన్సల్టెంట్ హెమటో ఆంకాలజిస్టు డాక్టర్ వై. నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా థలసేమియాపై అవగాహన కల్పించేందుకు కేసు స్టడీలతో కూడిన ఒక బుక్లెట్ను ఆవిష్కరించారు.

About Author