PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల మనిషి కామ్రేడ్ టీ. షడ్రక్ కి నివాళి – సిపిఎం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో న్యూ సిటీ కార్యదర్శి టి. రాముడు అధ్యక్షతన కామ్రేడ్ టి షడ్రక్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కామ్రేడ్ టి.షడ్రక్ గారి చిత్రపటానికి ఆయన సతీమణి టి.అన్నపూర్ణ, రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల, సిపిఎం జిల్లా నాయకులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు  పి .నిర్మల మాట్లాడుతూ చాగలమర్రి మండలం పెద్ద బోధనములో పేద కుటుంబంలో జన్మించిన షడ్రక్ 1974లో ఐటిఐ పూర్తి చేసుకొని కర్నూల్ నగరంలోని పేపర్ మిల్లులో ఉద్యోగంలో చేరి అక్కడ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. పేపర్ మిల్లులో సిఐటియు నిర్మాణం చేయటాన్ని ఓర్వలేక అక్కడ అసాంఘిక శక్తులు ఆయనను ఉద్యోగం నుండి తీసేయించాయని తెలిపారు. అప్పుడు ఉద్యోగం ముఖ్యమా, కార్మిక హక్కులు ముఖ్యమా అంటే కార్మికుల సమస్యల కోసం పోరాటమే ముఖ్యమని ఉద్యోగాన్ని వదిలేసి పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా వచ్చారని తెలిపారు. కర్నూల్ పట్టణంలోనూ జిల్లాలోనూ సిపిఎం పార్టీ నిర్మించడంలో టి.నరసింహయ్య.యంఎ. గఫూర్ తో కలసి టి.షడ్రక్ కృషి చేశారని తెలిపారు. ఏదైనా కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వెంటనే స్పందించి ధైర్యంగా వెళ్లి రౌడీలకు సైతం సవాల్ చేసే విధంగా పనిచేసిన ఘనత షడ్రక్ గారికి ఉందని అన్నారు. ప్రధానంగా పేపర్ మిల్ కార్మిక ఉద్యమం, మెడికల్ కాలేజీ ఎస్ఎఫ్ఐ ఉద్యమం, మోటార్ వర్కర్స్ నీ కేంద్రంగా చేసుకొని జిల్లాలో సిపిఎం పార్టీని నిర్మించడంలో కృషి చేశారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో కార్బైడ్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లులు, గ్లాస్ ఫ్యాక్టరీలలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. షడ్రక్ కృషివల్లే కర్నూల్ లో రెండుసార్లు సిపిఎం పార్టీ శాసనసభ్యులుగా ఎన్నుకోవడానికి ఉపయోగపడిందని తెలిపారు. చివరి క్షణం వరకు రాజీ పడకుండా ప్రజల సమస్యల కోసం కృషి చేశారు. రాజకీయాల కతీతంగా అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండి మంచి గొప్ప నేతగా పార్టీ నగర కార్యదర్శి నుండి జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎదిగారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి కరోనా మహమారి వల్ల మరణించడంతో ఇప్పటికీ ఆయన లేని లోటు సిపిఎం పార్టీ కి ఉందని తెలిపారు. షడ్రక్ గారి బాటలో డాక్టర్ వినోద్ పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు. కరోనా మహమారిని చూసి సొంతమనుసులే దగ్గరికి రావడానికి భయపడుతున్న రోజుల్లో కూడా తల్లిదండ్రులతోపాటు కరోనా పేషెంట్లను కాపాడడంలో ఐసోలేషన్ సెంటర్ నిర్మాణంలో డాక్టర్ వినోద్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అందరూ షడ్రక్ నీ స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యన్.నగేష్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి యండి.ఆనంద్ బాబు, ఐద్వా జిల్లా అధ్యక్షులు కె. అరుణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సియచ్.సాయిబాబా మాట్లాడుతూ షడ్రక్  ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక స్ఫూర్తిని గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి. గురుశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు అర్.నరసింహులు, కె.సుధాకరప్ప.కె.ప్రబాకర్. యస్.మహ్మద్ రఫీ,ఐద్వా నాయకులు పియస్.సుజాత .సావిత్రి కెవిపిఎస్ నాయకులు యం.భాస్కర్.జి.యేసు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి రాజు,లోకేష్.బతుకన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author