సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి
1 min readడిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నిక
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. డిసెంబర్ 5 తేదీన సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందన్నారు. డిసెంబర్ 8వ తేదీ నాడు ఎన్నికల ప్రక్రియ వుంటుందన్నారు. కేసి కాల్వ కింద 52, ఎస్సార్బీసీ కింద 50, తెలుగు గంగ కింద 47, శివ భాష్యం ప్రాజెక్ట్ కింద 7, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల కింద 104, మైలవరం కింద ఒకటి వెరిసి మొత్తం 261 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా సంబంధిత తాసిల్దారుల నుండి తీసుకోవాలన్నారు. ఓటింగ్ నిర్వహించే ప్రదేశాన్ని రైతులందరికీ తెలిసేలా విస్తృత పబ్లిసిటీ ఇవ్వాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ, ప్రాదేశిక సభ్యులు, అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులు ఎన్నికలు ప్రక్రియ కూడా అదే రోజు జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను పటిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఐదు లక్షల ఎకరాలకు పైగా ఇరిగేషన్ ల్యాండ్ ఉందని నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు బాధ్యతగల అధికారులను నియమించామన్నారు. ఎన్నికలలో నామినేషన్ వేసిన వ్యక్తిని ఎన్నుకోవడానికి రైతులు చేతులెత్తి తమ యొక్క ఆమోదాన్ని తెలపాలన్నారు. 11వ తేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14వ తేదీన ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈవోలు తదితర అధికారులు పాల్గొన్నారు.