PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరిగి పది సంవత్సరాలైనా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న నేపధ్యంలో, వీటి  పరిష్కార దిశగా చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అద్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి.రాష్ట్ర విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలకు ఈ నెల 6 వ తారీఖున సిద్దమైన వేళ సాగునీటి రంగంలో కీలకమైన అంశాలను పరిష్కారించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు కి మెయిల్ ద్వారా లేఖను దశరథరామిరెడ్డి పంపారు. ఈ సందర్భంగా నంద్యాల సమితి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ప్రాంతం అనీ, రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన అంశాల పరిష్కారంలో జాప్యం వలన నష్టపోతున్నది కూడా ఈ ప్రాంతాలేనని ఆవేదన వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ  ప్రాంతాల సాగునీటి రంగ అభివృద్ధికి రాజ్యాంగబద్ధమైన హక్కులను,  రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను దృష్టిలో ఉంచుకొని రెండు ప్రాంతాల అభివృద్ధికి మీరు కృషి చేయాలనీ, ఈ అంశాలపై ఈ నెల  ఆరో తారీఖున చేపడుతున్న చర్చలలో దిగువ పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, వీటి  పరిష్కారానికి పాటుపడాలని లేఖలో చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు.

గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం :- రాయలసీమలోని కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, అటు తెలంగాణలోని ఆర్డిఎస్ స్థిరీకరణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గుండ్రేవుల రిజర్వాయర్ డిపిఆర్ కు అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల త్రాగు నీటి, సాగునీటి ఇబ్బందులు తొలగింపుకు అత్యంత కీలకం. ఈ విషయాన్ని గుర్తించే గుండ్రేవుల రిజర్వాయర్ కు  2019 వ సంవత్సరం మీరు శంకుస్థాపన కూడా చేసారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం త్వరితగతిన సాగడానికి తెలంగాణ నుండి సానుకూల నిర్ణయం పొందాలి.

సిద్దేశ్వరం అలుగు :- శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక చేరికను నివారించి  శ్రీశైలం ప్రాజెక్టు జీవితం కాలం పెంచడం,  ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన తెలంగాణ, రాయలసీమ ప్రాజెక్టుల సక్రమ నిర్వహణకు  అత్యంత అవసరం. ఇరు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి.

కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు లో ఏర్పాటు :- పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రాజెక్టు అయినా పట్టిసీమ నిర్మాణంతో కృష్ణా డెల్టాకు శ్రీశైలం ప్రాజెక్టుతో  అనుబంధం తెగిపోయింది. (బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా డెల్టాకు కేటాయించిన 80 టి ఎం సీ ల కృష్ణా జలాలను పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను పొందుతుండటం  వలన, శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చెయ్యాల్సిన అవసరం లేదు‌. ఈ విధంగా శ్రీశైలం రిజర్వాయర్ లో ఆదా అయిన కృష్ణా జలాలపై  రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ ప్రాజెక్టులకు హక్కు కల్పించింది.) దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల మరియు  తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ అత్యంత కీలకంగా మారింది. కావున కృష్ణా జలాల నిర్వహణకు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేపట్టాలి.

దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు:

గోదావరి జలాల మళ్లింపుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు భరోసా:-  తెలంగాణ ప్రాంతంలోని ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు,  రాయలసీమలోని తెలుగు గంగ,  గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మిగులు జలాల మీద చేపట్టారు.  ఈ ప్రాజెక్టులకు నికర జలాలు అందించే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ కు అందజేసి,  ఆ విధంగా ఆదా అయినా కృష్ణా జలాలను మిగులు జలాల మీద  నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయించే లక్ష్యంతో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను చేపడతాం అని ప్రకటించారు. కానీ దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని విభజన అనంతరం విస్మరించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రాలకు 254 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను బ్రిజేష్ కుమార్  ట్రిబ్యునల్ తుది నివేదికలో కేటాయింపులు చేసింది‌. ఈ ట్రిబ్యునల్ నోటిఫై అయిన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు కూడా వందేళ్లలో ఐదారు సంవత్సరాల్లో కూడా నీరు లభించని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగులు జలాల మీద నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కృష్ణా జలాల లభ్యత కోసం రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టం “సెక్షన్ 89 ఏ” ప్రకారం ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపుల కొనసాగింపు :- బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర విభజన చట్టం “సెక్షన్ 89 ఏ” ప్రకారం ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు కొనసాగించాల్సి ఉంది.  బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులపై సుప్రీంకోర్టు కూడా సవరించడానికి వీలు లేదు. ప్రాజెక్టుల వారిగా కేటాయించిన నీటి కేటాయింపులు కొనసాగించాలి. రాజ్యాంగ బద్ధమైన ప్రాజెక్టుల వారి సాగునీటి హక్కుల మార్పుపై, తదితర అంశాలపై  పాలకులు కేవలం తాత్కాలిక రాజకీయ లబ్దికోసం పోరాడుతూ,  సాగునీటి అంశాల పరిష్కారాన్ని జఠిలం చేస్తున్నారనీ ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమస్యను జఠిలం చేయకుండా రాజ్యంగ బద్దంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాల  అభివృద్ధికి శాశ్వత పరిష్కారాన్ని ఈ సమావేశం ద్వారా సాధించే దిశగా అడుగులు వేయాలని దశరథరామిరెడ్డి  విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, మహమ్మద్ పర్వేజ్, మహేశ్వరరెడ్డి,కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

About Author