PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాలు స‌ర్వం సిద్దం

1 min read

– కౌంటింగ్ విధుల్లో వెయ్యి మందికి పైగా అధికారులు, సిబ్బంది

– కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు

– సూక్ష్మ ప‌రిశీల‌న‌, సీసీ కెమెరాల నిఘా న‌డుమ ఓట్ల లెక్కింపు

– జిల్లా క‌లెక్టర్ ఎస్‌.డిల్లీరావు, సీపీ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జ‌ర‌పాల్సి  ఉన్నందున ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శకాల‌ను అనుస‌రించి పార్లమెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల‌ను ఈ నెల 31వ తేదీ నాటికి స‌ర్వం సిద్ధం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్టర్ ఎస్‌.డిల్లీరావు, పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ తెలిపారు.జిల్లా క‌లెక్టర్ ఎస్‌.డిల్లీరావు.. పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌, జాయింట్ క‌లెక్టర్, మైల‌వ‌రం ఆర్‌వో  పి.సంప‌త్ కుమార్‌; విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్, విజ‌య‌వాడ సెంట్రల్ ఆర్‌వో స్వప్నిల్ దిన‌క‌ర్ పుండ్కర్ త‌దిత‌రుల‌తో క‌లిసి ఇబ్రహీంప‌ట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా క‌ళాశాల‌ల్లో కౌంటింగ్ ప్రక్రియ చేప‌ట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జ‌రుగుతుంద‌ని.. ఈ ప్రక్రియ‌కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయ‌న్నారు. ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేసి ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100 శాతం ప‌నులు పూర్తిచేయ‌నున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ‌ను స‌జావుగా నిర్వహించేందుకు ఈసీఐ మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని వ‌స‌తులతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వెయ్యి మందికి పైగా కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇత‌ర సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొన‌నున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్టమైన భ‌ద్రతా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని.. సూక్ష్మ ప‌రిశీల‌న‌, సీసీ కెమెరాల నిఘా న‌డుమ ప్రక్రియ‌ను నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గంద‌ర‌గోళానికి తావులేకుండా స‌రైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ‌లితాల స‌మాచారాన్ని ఎప్పటిక‌ప్పుడు మీడియా ద్వారా అందించేందుకు వీలుగా హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం, ఎల్ఈడీ టీవీల‌తో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్నట్లు తెలిపారు. రౌండ్ల వారీగా ఫ‌లితాల‌ను మీడియాకు అంద‌జేసేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు త‌దిత‌రుల‌కు అల్పాహారం, భోజ‌నం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయ‌నున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధ‌న‌ల మేర‌కు మొబైల్ ఫోన్లకు అనుమ‌తి లేనందున నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మొబైల్ ఫోన్లను భ‌ద్రప‌రిచేందుకు ప్రత్యేక కౌంట‌ర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంల‌ను తీసుకెళ్లేందుకు, సిబ్బంది, అధికారులకు ఒక‌వైపు, అభ్యర్థులు,  ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మ‌రోవైపు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివ‌రించారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు క‌లెక్టర్ డిల్లీరావు తెలిపారు.

ప‌టిష్ట భ‌ద్రత మ‌ధ్య లెక్కింపు: పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌

కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద మూడంచెల భ‌ద్రతా విధానాన్ని అమ‌లుచేస్తున్నామ‌ని.. పాస్‌లు, గుర్తింపు కార్డులు క‌లిగిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల ఆవ‌ర‌ణ‌లోకి అనుమ‌తించ‌డం జ‌రుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టిప‌రిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లను అనుమ‌తించ‌బోమ‌న్నారు. సీసీ కెమెరాల ప‌ర్యవేక్షణ న‌డుమ ప‌క‌డ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ కొన‌సాగేలా చ‌ర్యలు తీసుకున్నట్లు ఆయ‌న తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా చ‌ర్యలు తీసుకోవ‌డంతో పాటు పార్కింగ్‌కు కూడా స‌రైన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు టి.హ‌రికృష్ణ‌, కె.చ‌క్రవ‌ర్తి, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ తూర్పు ఆర్‌వో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, తిరువూరు ఆర్‌వో కె.మాధ‌వి, నందిగామ ఆర్‌వో ఎ.ర‌వీంద్రరావు, విజ‌య‌వాడ ప‌శ్చిమ ఆర్‌వో ఇ.కిర‌ణ్మయి, జ‌గ్గయ్యపేట ఆర్‌వో జి.వెంక‌టేశ్వర్లు, డీఐపీఆర్‌వో యు.సురేంద్ర‌నాథ్‌, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహ‌న‌రావు, పోలీస్‌, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, ట్రాన్స్‌కో, అగ్నిమాప‌క‌ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

About Author