కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణపై అవగాహన కల్పించండి
1 min readజిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జూన్ 4 వ తేదిన జరగనున్న సాధారణ ఎన్నికలు -2024 కౌంటింగ్ కి సంబంధించి విధులు నిర్వహించే సిబ్బందికి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద పూర్తి స్థాయిలో శిక్షణ తరగతులలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పేర్కొన్నారు.గురువారం కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామంలోని జి ఆర్ సి కన్వెన్షన్ హాల్లో సాధారణ ఎన్నికలు -2024 కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి మే 24వ తేది నిర్వహించనున్న శిక్షణ తరగతులకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ లతో కలిసి జిల్లా కలెక్టర్ డా జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణకు హాజరయ్యే సిబ్బందికి కలెక్టరేట్ నుండి బస్ లు ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని వారికి తెలియచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. ఈ వి ఎమ్ మెషీన్ కౌంటింగ్ రౌండ్ వారిగా కౌంటింగ్ చేసి టాబులేషన్ ప్రకారం ఏ విధంగా ఎంట్రీ చేయాలో శిక్షణ ఇవ్వాలని అందుకు సంబంధించిన టాబులేషన్ షీట్ లను కూడా ఇవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు. అందరికీ కనిపించే విధంగా చుట్టూ పెద్ద పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు టేబుల్స్ కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి సంబంధిత టేబుల్స్ మీద నంబరింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన సిబ్బందికి భోజన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.