‘పల్లెపండగ’తో.. గ్రామాల అభివృద్ధి..
1 min readసీసీ రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీల ఏర్పాటు
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ చొరవతో నిధుల కేటాయింపు
- పంచాయతీ రాజ్ జిల్లా అధికారి గుర్రాల భాస్కర్
కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ పల్లె పండగ ’ కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ పట్టనుందని, గ్రామాల అభివృద్ధితో కర్నూలు జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ జిల్లా అధికారి గుర్రాల భాస్కర్. బుధవారం తన ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించనున్న సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ప్రత్యేక చొరవతో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించారని, దీంతో గ్రామీణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులన్నింటికీ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా డీపీఓ జి. భాస్కర్ కోరారు.
పారిశుద్ధ్యంపై.. ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాలోని ప్రతి గ్రామంలో తాగునీరు ట్యాంకుల, పైపులు లీకేజీ లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా డీపీఓ జి. భాస్కర్ తెలియజేశారు. గ్రామీణ ప్రజలకు, పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.