PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తాం

1 min read

రూ. 20 కోట్లతో నామవరంలో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి

పాల్గొన్న ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, బడేటి చంటి

పల్లెవెలుగు, ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. చింతలపూడి మండలం నామవరంలో శనివారం నాబార్డు నిధులు రూ. 20 కోట్లతో నిర్మించనున్న బోయగూడెం నుంచి సీతానగరం వయా శెట్టివారిగూడెం, నామవరం రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్ధాపన చేశారు. అదే విధంగా చింతలపూడి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి స్ధానిక శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ రూపొందించిన జనహితం యాప్ ను రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అయితే ఆరోడ్లను  అభివృద్ధిచేసి పూర్తిచేయాలనే తలంపులో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం కింద చేపట్టే రోడ్లతోపాటు ప్రతి నియోజకవర్గంలో రూ. 10 నుంచి 20 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లను అభివృద్ది పరచాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు.  ఇందుకు కొంత సమయం అవసరమన్నారు. అనుభవజ్ఞుడైన, దూరదృష్టిగల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు మరో ప్రక్క గొప్ప ఆలోచనపరుడైన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్లుతుందని ఆయన స్పష్టం చేశారు.  పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.  కేంద్రం నుంచి 12 వేల కోట్ల రూపాయలు ఒకే విడతలో తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.  అదే విధంగా 15 వేల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చుపెట్టేందుకు కేంద్రం ప్రకటించగా ఇంకా అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామనే భరోసాను కేంద్రం నుంచి ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగిందన్నారు.  గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చింతలపూడి ఎత్తిపోతుల పధకం ముందుకు సాగలేదన్నారు.  ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 4 వేల కోట్లు రూపాయలు ఖర్చుచేయగా గత ప్రభుత్వం కేవలం 10 కోట్ల రూపాయలను ఖర్చుచేసి ప్రాజెక్టును మూలనపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 5 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో చింతలపూడి ఒకటిగా ప్రభుత్వం పెట్టిందన్నారు.  ఈ ప్రాజెక్టు మూలంగా నూజివీడు, తిరువూరుకు సాగునీరు, త్రాగనీరు అందుతుందన్నారు.  చింతలపూడి ప్రాజెక్టును పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.  ఆహర్నిశలు చిత్తశుద్దితో ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారన్నారు.  ఎటువంటి కక్షలకు తావులేకుండా, ప్రజలు అందించిన విజయాన్ని బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రజలకు, యువత సంక్షేమ అభివృద్ధికి కృషిచేయాలని గౌ. ముఖ్యమంత్రి పదేపదే ప్రజా ప్రతినిధులకు చెప్పడం జరుగుతున్నదన్నారు.  గత ప్రభుత్వం సుమారు 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీసిన పరిస్ధితికి తీసుకువచ్చారని అటువంటి పరిస్ధితుల్లో రాష్ట్ర భవిష్యత్ ను తిరిగి గాడిలోపెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించే దిశగా ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో కృషిచేస్తున్నారన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సొమ్మును పెంచడమే కాకుండా బకాయిలతో సహా చెల్లించడం జరిగిందన్నారు.  గత ప్రభుత్వం 6 స్టెప్ పద్దతిలో పెన్షన్లు తొలగించేలా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తుచేశారు.  2014-19 లో ఇళ్లు కట్టుకున్న వారి బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదన్నారు.  పశువులు, గొర్రెలు, ఇన్సూరెన్స్ చెల్లింపులు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి   ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారన్నారు.  ఇదే విషయం పలువురు తెలంగాణా నాయకులు కూడా తమకు తెలియజేయడం జరిగిందని చెప్పారు.  ప్రజల నిర్ణయం, తమ ఆలోచనలమేరకే గ్రామల్లో పనులు చేపట్టి గ్రామాభివృద్ధి కోసం ఈనెల 23వ తేదీన నిర్వహించుకున్న గ్రామ సభలు విజయవంతంగా పూర్తిచేసుకున్నామన్నారు.

            ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన రోడ్ల అభివృద్దిలో భాగంగా తొలి విడతలో వర్షాకాలం అనంతరం గోతులు పూడ్చి వచ్చే ఏడాదినుంచి రోడ్ల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  కొన్ని రోడ్లను పిపిటి మోడల్లో అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో ఏలూరు, జంగారెడ్డిగూడెం రహదారికూడా ఉందన్నారు.  పొగాకు రైతులు కోరిన విధంగా సీలింగ్ లిమిట్ తీసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవడం జరిగిందని దీని మూలంగా రైతులకు 106 కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరుతుందన్నారు.  పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న మాటకు కట్టుబడివున్నామన్నారు.  ఏలూరులో 4, నూజివీడులో 1 అన్న క్యాంటిన్ లు ప్రారంభించుకున్నామని, త్వరలో జంగారెడ్డిగూడెం లో కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.  వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏలూరులోరేపటి నుండి ఆగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 

            సమావేశానికి అధ్యక్షత వహించిన చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం ముందుకు వెళ్లుతున్నదని చెప్పారు.  గ్రామాల అభివృద్ధికి గౌ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉపాధిహామీ పధకం ద్వారా పెద్దఎత్తున నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు.  3 దశాబ్దాల కల సాకారం నెరవేరబోతున్నదని 7 గ్రామాలకు ఒక మంచి రహదారి రాబోతున్నదని ఆయన తెలిపారు.  ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై జనహితం యాప్ ను తీసుకువచ్చామని దానిని చింతలపూడి నియోజవర్గ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి),మాజీ శాసన సభ్యులు గంటా మురళి,  బిజేపి జిల్లా అధ్యక్షులు విక్రమ్, జనసేన ఇన్ చార్జి మేకా ఈశ్వరయ్య,తదితరులు ప్రసంగించారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జరపాల వెంకటేశ్వరరావు, స్ధానిక నాయకులు గుత్తా పెదబాబు, పలువురు మాజీ జెడ్పిటిసిలు, యంపిపిలు, స్ధానిక ప్రజా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author