నిరుపేద హిందూ.. ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ
1 min readప్రపంచంలో మతకలహాలు, కల్లోలాలు ఉన్న ఏ దేశము ఆనందంగా ఉన్న దాఖలాలు లేవు.
మొహరం పర్వదినం సందర్భంగా నిరుపేద హిందూ, ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచంలో మతకలహాలు, కల్లోలాలు ఉన్న ఏ దేశంలో ప్రజలు ఆనందంగా ఉన్న దాఖలాలు లేవని, ఆ దేశాల్లో జాతి తో పాటు దేశం తీవ్రంగా దెబ్బ తింటుందని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని గాయత్రీ ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్ లో నిరుపేద హిందూ, ముస్లిం మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక అయిన మొహరం పర్వదినాన్ని హిందూ ముస్లింలు కలిసికట్టుగా చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూ ముస్లిం పేద మహిళలకు చీరలను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మతసామరస్యం ఎంతో అవసరమని ఆయన వివరించారు. మతకలహాలు, కల్లోలాలు చెలరేగితే ఆ దేశాలు అన్ని రంగాల్లో విచ్చిన్నమైపోతాయని ఆయన తెలియజేశారు. మతకలహాలు, కల్లోలాల వల్ల ఆసియా ఖండంలో అనేక దేశాలు నాశనం అయ్యాయని, మతకలహాలు ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో కూడా మొదలు కావడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. మత కలహాల వల్ల ఆయా దేశాల్లో స్త్రీలు ,చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన తెలిపారు. భిన్న జాతులు, తెగలు, మతాలు మన దేశంలో ఉన్నాయని, ఇలాంటి దేశాల్లో భిన్న మతాల మధ్య బ్యాలెన్స్ దెబ్బ తినకుండా కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత కలహాలు, కల్లోలాల వల్ల ఆయా దేశాల్లో దేశ అంతర్గత భద్రత దెబ్బతినడంతో పాటు విదేశీ పెట్టుబడులు ,పారిశ్రామిక రంగం, విద్యారంగం ఇలా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బ తింటాయని తెలిపారు. ముఖ్యంగా దేశంలో స్త్రీలకు స్వాతంత్రం ఎంతో అవసరమని అప్పుడే దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.