శారీరక ఎదుగుదలలేని పిల్లల కోసం జిల్లా సత్వర చికిత్స కేంద్రం ఏర్పాటు
1 min readజిల్లా కలెక్టర్ డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులతో పాటు మానసిక, శారీరక ఎదుగుదలలేని పిల్లల కోసం జిల్లా సత్వర చికిత్స కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నేషనల్ హెల్త్ మిషన్ గ్రాంట్ కింద కోటి 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా సత్వర చికిత్స కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా జి.సృజన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీస్క్) ద్వారా 0 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను హెల్త్ స్క్రీనింగ్ చేసి పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులతో పాటు మానసిక, శారీరక ఎదుగుదల లేని వారిని ముందుగా గుర్తించి సంబంధిత పిల్లలను జిల్లా సత్వర చికిత్స కేంద్రానికి రెఫర్ చేస్తే, జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో ఉండే వైద్యులు చిన్నారులను అక్కున చేర్చుకొని వారిని మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందించి, పిల్లల జీవన నాణ్యతను మెరుగుపరుస్తారని కలెక్టర్ తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులతో పాటు మానసిక, శారీరక ఎదుగుదల లేని సమస్యలను వెంటనే గుర్తిస్తే వాటిని త్వరగా నయం చేయడమే జిల్లా సత్వర చికిత్స కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. పుట్టుకతో వచ్చే సమస్యలు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలా పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులతో పాటు మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి జిల్లా సత్వర చికిత్స కేంద్రం (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్) అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా.వెంకట రంగారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ప్రవీణ్ కుమార్, ఆర్ బి ఎస్కే జిల్లా ప్రోగ్రామ్ అధికారి హేమలత, ఎపిఎంఎస్ఐడిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.