PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీపావళి కానుక… ఉచిత గ్యాస్ సిలిండర్లు

1 min read

రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతులు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు దీపం పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ఆద్యుడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతులు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొనియాడారు. రెండు దశాబ్ధాల క్రితమే దీపం పథకం ద్వారా మహిళలకు పొగరహిత వంట గ్యాస్ ను అందించడంతో పాటు, మహిళల వంట ఇంటి కష్టాలకు చెక్ పెట్టిన ఘనత సైతం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా  దీపం – 2 పథకంను శుక్రవారం బనగానపల్లె పట్టణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ జి. రాజకుమారి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీలో భాగంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీని కలెక్టర్ తో కలిసి, మహిళలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేశారు.  అనంతరం  ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తోందని…ఇందులో భాగంగా దీపావళి కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో, ఆర్ధిక స్వేచ్చతో జీవించాలనే ఆలోచనతోనే అప్పట్లోనే ఈ పొదుపు సంఘాలు, డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. నాడు చంద్రబాబునాయుడు దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ లు అందిస్తే, నేడు అది ఉచిత గ్యాస్ ల పంపిణీ వరకు వచ్చిందన్నారు. ఇప్పుడు ఒక్కొ కుటుంబానికి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు ఆదా అవుతుందని మంత్రి అన్నారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3 నెలల సమయం ఇచ్చిందని, ఎవ్వరూ కూడా తాము వెంటనే బుక్ చేసుకోకపోతే, గ్యాస్ సిలిండర్ కోల్పోతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.  సిలిండర్ బుకింగ్ సమయంలో చెల్లించిన నగదు.. 48 గంటల్లో మీ ఖాతాల్లో పడతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటైన  తర్వాత పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు 3000 నుండి 4000 రూపాయలు పెంచడం, వికలాంగులకు 6000 రూపాయలు, వైద్య చికిత్స పొందుతున్న బాధితులకు 10 వేలు, 15 వేల రూపాయలను ప్రతి నెల ఒకటో తేదీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సరఫరా కోసం సిలిండర్ల ఆటోను జెండా ఊపి ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ ప్రారంభించారు.

About Author