కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించకూడదు..
1 min readజిల్లా ఎన్ఎంఆర్ వేతన కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడి..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో దినసరి వేతనం కింద పనిచేస్తున్నఎన్ఎంఆర్ కార్మికులకు 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా ఎన్ఎంఆర్ వేతన కమిటీ సమావేశంలో దినసరి వేతనాన్ని నిర్ణయించారు. స్ధానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గురువారం కనీస వేతనాల అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎన్ఎంఆర్ డైలీ వేతనం కింద పనిచేస్తున్న కార్మికులకు నిర్ణయించిన వేతనం కన్నా తక్కువ వేతనం చెల్లించకూడదని స్పష్టం చేశారు. నైపుణ్యం గల, పాక్షిక నైపుణం గల నైపుణ్యం లేని కార్మికులకు వేరు వేరుగా దినసరి వేతనాన్ని కమిటీలో నిర్ణయించారు. నైపుణ్యం గలవారికి రూ. 675 నుంచి రూ. 710 వరకు, పాక్షిక నైపుణ్యం గల వారికి రూ.605 నుంచి రూ.640 వరకు, నైపుణ్యం లేని వారికి రూ. 562 నుంచి 595 వరకు వేతనాలను నిర్ధారిస్తూ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ వేతనాలు 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. సమావేశంలో ఉప కార్మిక కమీషనరు పి. శ్రీనివాస్, సహాయ కార్మిక కమీషనరు నాగేశ్వరరావు, పంచాయితీరాజ్ ఎస్ఇ కె. సురేష్, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఇ కె. రాజు, ఆర్ అండ్ బి ఇఇ వై.వి. కిషోర్, తదితరులు ఉన్నారు.