మాజీ సైనికుల సంక్షేమం కోసం సాయుధ దళాల పతాక నిధికి ఉదారంగా విరాళాలు ఇవ్వండి
1 min readకార్ ఫ్లాగ్స్ ను, స్టిక్కర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
అమరులైన వీర జవాన్లకు, వితంతువులకు, కుటుంబ సభ్యులను ఆదుకునే క్రమంలో ప్రజలు విరాళాలు అందించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు ప్రతినిధి: మన దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు విధులను నిర్వర్తిస్తున్న సైనికులకు మరియు మాజీ సైనికుల సంక్షేమానికోసం సాయుధ దళాల పతాక నిధికి అన్ని వర్గాల ప్రజలు ఉదారంగా, విరివిగా విరాళాలు అందించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సాయిధ దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకొని రూపొందించిన స్టిక్కర్లు,కార్ ఫ్లాగ్స్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కె.వి.ఏస్ ప్రసాదరావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రాధాన్యత, సైనిక సంక్షేమ నిధికి విరాళాల సేకరణ అంశాలపై జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులకు వివరించి కరపత్రాలను అందించి, విరాళాల సేకరణకు జిల్లా అధికారుల సహకారాన్ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు సాయుధ దళాలలో పనిచేస్తున్న సైనికులకు సంఘీభావాన్ని ప్రకటించి మాజీ సైనికుల పునరావస కార్యక్రమంలో అమరులైన వీర జవాన్లకు, వితంతువులకు వారి కుటుంబ సభ్యులకు ఆదుకునే క్రమంలో ఉదారంగా ప్రజలు విరాళాలు అందించవలసిందిగా కోరారు. మన దేశ సాయుధ దళాలు యుద్ధ సమయంలోను, శాంతి సమయంలోను దృఢ సంకల్పము మరియు ఏకాగ్రతతో దేశసేవ చేస్తున్నారని, మాతృదేశం కొరకు అసువులు బాసిన వీర సైనికులు వారి వితంతువులు, కుటుంబ సభ్యులపై దేశ ప్రజల బాధ్యతను ఈ పతాక దినోత్సవం గుర్తు చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూసాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ సైనికులు మరియు యుద్ధ సమయంలో మరణించిన వారి వారసుల సంక్షేమం కొరకు జిల్లాలోని ఎన్.సి.సి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు హుండీ ద్వారా ప్రజల నుండి విరాళాలను సేకరించి స్టిక్కర్లను, కార్ ఫ్లాగ్స్ ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పంపి వాటి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమును విరాళముగా స్వీకరించబడుతుందని తెలిపారు. విరాళాలను జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఎస్.బి.ఐ ఖాతా నెం. 62068471992 ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్. SBIN 0012722 ద్వారా కూడా అందించవచ్చునని తెలిపారు.