PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుగ్గిరాలలో పశువుల త్రాగునీటి తొట్టెలు  పరిశీలిస్తున్న డీపీఓ 

1 min read

మూగజీవులకు త్రాగునీటి వసతి కల్పించండి.

డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

500 పశువుల తాగునీటి తొట్టెలు పునరుద్ధరణ

పల్లెవెలుగు వెబ్  ఏలూరు జిల్లా ప్రతినిధి : త్రాగునీటి కోసం మూగజీవులు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాయని జంతువులకు త్రాగునీటి వసతి కల్పించి మూగ జీవులను ఆదుకోవాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. గురువారం దుగ్గిరాల గ్రామ పంచాయతీని ఆకస్మికంగా తనిఖీచేసి పశువుల త్రాగునీటి వసతి తొట్టెలను పరిశీలించారు.  వేసవి తాకిడి ఎక్కువగా ఉండడం, భూగర్భ జలాలు తగ్గడం, గ్రామాలలో చెరువులు నిండుకుండడం, జనాభా పెరుగుదల, వారి అవసరాలు పెరగడం వలన నీటి సమస్య జటిలంగా మారిందని వాటి ప్రభావం మనుషులతో పాటు పశువులఫై కూడా పడిందని అన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడం వలన మూగజీవులు ఇబ్బంది పడకుండా గ్రామాలలో పశువులకు త్రాగునీటి వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించడం జరిగిందని. దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో ఉన్న అన్ని త్రాగునీటి తొట్టెలను పునరుద్దరించి జంతువుల కోసం త్రాగునీటి వసతి కల్పించాలన్న పంచాయతీ కార్యదర్సులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని అన్నారు. దానిలో భాగంగా దుగ్గిరాల గ్రామం రావడం జరిగిందన్నారు. వేసవి ప్రణాళికలలో భాగంగా చెత్త, ఎండుటాకులు, మురికితో నిండిన పశువుల తొట్టెలను శుభ్రపర్చి నీటితో నింపాలని అన్నారు. లైవ్ స్టాక్ రికార్డు ప్రకారం జిల్లాలో రెండు లక్షల ఆవులు, ఐదు లక్షల గేదలు, ఐదున్నర లక్షల గొర్రెలు, రెండు లక్షల మేకలు ఉన్నాయని గుర్తుచేస్తూ పాడి పశువులు మనజాతి సంపదని, పల్లె సంస్కృతిలో భాగమైన పశువులను సంరక్షించే భాద్యత అందరిదని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. జిల్లాలో ఉన్న 500 పశువుల త్రాగునీటి తొట్టెలను రెండు రోజులలో పునరుద్దరించి మూగ జీవులకు త్రాగునీటి వసతి కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, డీపీఎం పులి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

About Author