డా.పార్థసారధికి.. మంత్రి పదవి ?
1 min readసీమలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే
- ఆదోని చరిత్రలో మొదటిసారిగా బీజేపీ జెండా ఎగరేసిన ధీశాలి
- కేంద్ర రక్షణ శాఖ డైరెక్టర్ గా విశిష్ట సేవలు అందిస్తున్నాడు..
- దేశ ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితుడు..
- సక్సెస్ ఫుల్ డాక్టర్‌గా పేరుగాంచాడు..
- పోరాట పఠిమతో విజయం సాధించాడు..
- వైసీపీ కంచుకోటలో …పాగా వేశాడు..
- ఆదోని నుంచి మొదటిసారిగా మంత్రి పదవికి యత్నాలు
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి రాష్ట్రంలో వైసీపీ గల్లంతయ్యింది. మునుపెన్నడు లేని విధంగా కూటమి (బీజేపీ–జనసేన– బీజేపీ)జిల్లాలో 5 స్థానాల్లో విజయదుంధబి మోగించింది. అందులో నలుగురు టీడీపీ నుంచి గెలుపొందగా… ఒకరు మాత్రమే బీజేపీ నుంచి విజయం సాధించారు. రాయలసీమలోనే బీజేపీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన ఏకైక వ్యక్తి డా. పార్థసారధి. అతి తక్కువ సమయంలో ఆదోని ప్రజల అభిమానాన్ని చూరగొన్న డా. పార్థసారధి వాల్మీకి.. రాష్ట్ర కేబినెట్లో చోటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఆదోని, పల్లెవెలుగు: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే కేబినెట్ లో బెర్త్ కోసం తాజా ఎమ్మెల్యేలు తాడేపల్లిగూడెంలోని చంద్రబాబు నాయుడు ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుడు, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డికి ఫోన్ రావడంతో కాబోయే సీఎంను కలిశారు. ఈ క్రమంలో ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డా. పార్థసారధి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కేబినెట్ బెర్త్ కోసం చర్చించినట్లు తెలుస్తోంది.
ఆదోని చరిత్రలో… మొదటి సారి…
గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డా. పార్థసారధి మూడో స్థానంలో నిలిచి.. ఓటమిపాలయ్యారు. అయితే దేశంలోనే బీజేపీకి రెండవ ఓటు బ్యాంకు సాధించి… కేంద్ర పెద్దల మన్ననలు చూరగొన్నారు. వైద్యరంగంలో రాణిస్తూనే… సక్సెస్ పొలిటిషియన్‌గా గుర్తింపు పొందాలన్న తలంపుతో… తప్పనిసరి పరిస్థితిలో తాజా ఎన్నికల్లో ఆదోని కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి.. అఖండ మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు జిల్లాలోనే ఆదోనిని అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.
పోరాట పఠిమతోనే.. విజయం..
ఆదోని ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డిని ఢీకొనాలంటే… అంతా సులవు కాదు. ఒక సారి కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ నుంచి గెలుపొందిన ఆయన… ఆదోనిని వైసీపీ కంచుకోటగా మార్చుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొంకా మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్, జనసేన ఇన్చార్జ్ మల్లప్ప, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ, శ్రీకాంత్ రెడ్డితోపాటు మరికొందరి సహకారంతో డా. పార్థసారధి ఆదోనిలో బీజేపీ జెండాను రెపరెపలాడించారు. బలమైన సంకల్పం…పోరాటదీక్షతో బరిలో నిలిచిన డా. పార్థసారధి ..అతి తక్కువ సమయంలో ఆదోని ప్రజల ఆదరాభిమానాలు పొందారు. 18వేలకు పైగా ఓట్లతో విజయ ఢంకా మోగించారు.
ప్రయత్నం..ఫలిస్తుందా…?
రాయలసీమలోనే ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన డా. పార్థసారధి.. రాష్ట కేబినెట్లో బెర్త్ కోసం కేంద్ర పెద్దల సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర, కేంద్ర పెద్దల సమన్వయంతో చేస్తున్న ప్రయత్నాలు.. ఎంత వరకు ఫలిస్తాయోనని ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ లో తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కితే… ఆదోని శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.