విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించండి
1 min readజల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ వాడకం పొదుపు పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 14 నుండి 20 వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా అందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు విద్యుత్ వాడకం అధికం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ వృధా కాకుండా ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకునేలా విద్యుత్ వాడకంపై అవగాహన కల్పించాలన్నారు..పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన,వక్తృత్వపు పోటీలు, కళాశాల విద్యార్థులకు వర్క్ షాపులు నిర్వహించి విద్యుత్ సంరక్షణ పై అవగాహన కల్పించాలన్నారు.. మహిళా సంఘాలు,ఇతర వినియోగదారులకు, రైతులకు విద్యుత్ పొదుపు ఆవశ్యకత, సమర్థవంతంగా వినియోగించుకోవడంపై వివరించాలన్నారు..వినియోగదారులకు కరపత్రాలను పంపిణీ చేసి విద్యుత్ ఆదా గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి నవ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ, ఏపీ ఎస్పీడీసీఎల్ SE ఉమాపతి, DE,AE,లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.