మున్సిపాలిటీల్లో అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి
1 min readఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తో కలిసి సమీక్షించిన ఎంపీ మహేష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తో కలిసి చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్లతో ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. రూ.12 కోట్ల ఆదాయం కలిగిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ -2 నుంచి గ్రేడ్ -1 గా వర్గొన్నతి కల్పించాలని పంపిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని కమిషనర్ కె.వి రమణ ఎంపీ మహేష్ కుమార్ కు వివరించారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పనకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి రూ. 80 కోట్లతో, సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులు చేపట్టేందుకు రూ.50 కోట్లు, చింతలపూడి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రూ.42 కోట్లు, కొయ్యలగూడెం నగర పంచాయతీలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎంపీ స్పష్టం చేశారు.