ఇంట్లో పెద్దలది చాదస్తం కాదు.. డిమెన్షియా!
1 min read* కొన్నిరకాల మతిమరుపులకు చికిత్స కూడా సాధ్యమే
* మెదడులో నీరు చేరి ఇబ్బంది పడిన 73 ఏళ్ల వృద్ధుడు
* మతిమరుపు, వేగంగా నడవడం, మూత్రంపై కొరవడిన నియంత్రణ
* శస్త్రచికిత్సతో నయం చేసిన కామినేని వైద్యులు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత డిమెన్షియా (మతిమరుపు) అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. పిల్లలకు అప్పుడే ఫోన్ చేసినా, చేయలేదనుకుని మళ్లీ మళ్లీ చేయడం, మధ్యాహ్నం ఏం తిన్నారో సాయంత్రానికి గుర్తు లేకపోవడం, మనుషులను కూడా గుర్తుపట్టకపోవడం లాంటివి ఉంటాయి. వీటిని చాలామంది పిల్లలు చాదస్తం అని భావిస్తూ, పెద్దలను విసుక్కుంటారు. కానీ, నిజానికి అది డిమెన్షియా అని గుర్తించడం ముఖ్యం. అలా గుర్తించి, చికిత్స చేయిస్తే వారికి పూర్తిగా నయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని రకాల డిమెన్షియాలలో సరికొత్త సమస్యలు వస్తాయి. వారికి మూత్రంపై నియంత్రణ ఉండదు. సాధారణం కంటే చాలా వేగంగా నడుస్తుంటారు. ఎదురుగా ఉన్నవారు తప్ప ఎక్కడో ఉన్నవారి పేర్లు కూడా గుర్తుండవు. ఇలాంటి సమస్యలు ఉన్నవారి విషయంలో పిల్లలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అది వైద్యపరమైన సమస్య అన్న విషయం తెలుసుకుని, సరైన వైద్యులకు చూపించి నయం చేయించుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్యే ఉన్న 73 ఏళ్ల వృద్ధుడికి ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వైద్యులు చిన్నపాటి చికిత్స చేసి, మొత్తం నయం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రమేష్ వివరించారు. “విశాఖపట్నానికి చెందిన 73 ఏళ్ల శంకర్రావు గత ఆరేడు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు మూత్రవిసర్జనపై నియంత్రణ లేదు. మామూలుగా నడిచేదాని కంటే చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. దాంతోపాటు, మధ్యాహ్నం ఏం తిన్నారో సాయంత్రానికి గుర్తు ఉండేది కాదు. ఇలా పలు రకాల సమస్యలు ఉండేవి. కుటుంబ సభ్యులు మొదట్లో కాస్త ఇబ్బంది పడేవారు. పిల్లలకు ఫోన్ చేసినా, చేయలేదనుకుని మళ్లీ మళ్లీ చేసేవారు. దీంతో పిల్లలకు కూడా బాగా ఇబ్బందిగా ఉండేది. దీంతో వేర్వేరు ఆస్పత్రులలో చూపించి, చివరకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనను పరీక్షిస్తే మెదడులో నీరు చేరినట్లు తెలిసింది. సాధారణంగా చిన్నవయసులో వారికి ఇలా నీరు చేరితే ఆ భారాన్ని మోయలేక కోమాలోకి వెళ్లిపోతారు. కానీ పెద్ద వయసు వచ్చే కొద్దీ మెదడు క్రమంగా కుచించుకుపోతుంది. దానివల్ల అక్కడ కొంత స్థలం ఏర్పడి, అందులోకి ఈ నీరు చేరుతుంది. ఇలా నీరు చేరడం వల్ల అది మెదడుపై ఒత్తిడి కలిగించి, అందువల్ల డిమెన్షియా వస్తుంది. ఈ తరహా డిమెన్షియాను మాత్రం చిన్నపాటి శస్త్రచికిత్స పద్ధతులతో నయం చేయవచ్చు. ఈ కేసులో శంకర్రావుకు వరుసగా మూడు రోజుల పాటు వెన్నెముక నుంచి నీరు తొలగించాం. దానివల్ల మెదడులో ఉన్న నీరు క్రమంగా తగ్గింది. ఆ తర్వాత మెదడులో ఒక స్టెంట్ వేశాం. దాన్నుంచి మెదడులో ఉండే నీరు క్రమంగా పొట్టలోకి వచ్చి, విసర్జన మార్గాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇలా నీరు తీసిన మరు నిమిషం నుంచే శంకర్రావు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన మళ్లీ తన సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు, అందరినీ గుర్తుపడుతున్నారు. నడక కూడా సాధారణ స్థితికి చేరుకుంది. ఎలాంటి సమస్యా లేదు. ఇక రాబోయే ఐదేళ్ల వరకు కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు వైద్యులకు చూపించుకుంటూ, అవసరమైన మందులు వాడితే సరిపోతుంది” అని డాక్టర్ రమేష్ వివరించారు. అయితే, అన్ని రకాల డిమెన్షియాలకూ ఈ చికిత్స పనికిరాదని, కేవలం మెదడులో నీరు చేరడం వల్ల కలిగే డిమెన్షియాను మాత్రమే ఇలా తగ్గించగలమని ఆయన తెలిపారు.