పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలని,స్మార్ట్ మీటర్లు ఉపసంహరించాలని,అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం,మండల అధ్యక్షులు పి.రామాంజనేయులు,కోశాధికారి బి.నాగమద్దయ్య లు డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం స్థానిక పాత బస్టాండ్ నందు భోగి మంటల్లో కరెంటు బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ
ప్రజలపై భారాలు మోపడంలో పాలకులు గత ప్రభుత్వం గాని నేటి ప్రభుత్వం గాని దొందు దొందే అని కార్పొరేట్లతో కుమ్ముక్కై విద్యుత్ ఛార్జీలు అడ్డూ అదుపూ లేకుండా పెంచుతున్నారని వారు అన్నారు.గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు పెట్టబోము పెడితే పగలగొట్టండి అని పిలుపు ఇచ్చారని,కరెంటు చార్జీలు కూడా పెంచబోమని ఇంకా తగ్గిస్తాము అని కూడా హామీలు ఇచ్చారని తీరా అధికారంలోకి వచ్చాక పిక్స్ చార్జీలు,కస్టమర్ చార్జీలు,ఇంధన సర్దుబాటు చార్జీలు,ట్రూ అప్ చార్జీలు అంటూ దాదాపు లక్ష కోట్లకు పైగా ప్రజలపై బారాలు మోపడానికి సిద్ధమయ్యారని ఈ నెలలో వచ్చిన కరెంటు బిల్లులు ప్రజలకు షాక్ కొట్టేలా ఉన్నాయని వారు అన్నారు.మరోవైపు గత ప్రభుత్వం అదానీ సంస్థలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్లనే భారాలు పడుతున్నాయని చెప్పడం దారుణమని వారన్నారు.హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అని అటువంటప్పుడు ఆ ఒప్పందాలను మీరెందుకు కొనసాగిస్తున్నారని ప్రజా శ్రేయస్సు కోసం తమిళనాడు ప్రభుత్వం వలె రద్దు చేయకపోవడం లో ఉన్న ఆంతర్యం ఏమిటని అందులోని అవినీతిపరుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.ఉన్న విద్యుత్ మీటర్లను తొలగించి ఇప్పటికే స్మార్ట్ మీటర్లను షాపులు,కార్యాలయాలకు బిగించారని,గృహాలకు బిగించడానికి రంగం సిద్ధం చేశారని స్మార్ట్ మీటర్ ఖరీదు 10 నుండి 15 వేల రూపాయలు ప్రజలకు అదనపు భారం అవుతుందని ఒకేసారి కాకపోయినా ప్రతి నెల విద్యుత్ బిల్లుతోపాటు మీటర్ బిల్లు కూడా ప్రజల నుండే వసూలు చేస్తారని స్మార్ట్ మీటర్ల పాలసీ ప్రజల ప్రయోజనాల కోసం కానే కాదని ప్రజల సొమ్ము అదానికి అప్పనంగా దోచి పెట్టడానికేనని ఎద్దేవా చేశారు.ఇప్పటికే అధిక ధరలతో సామాన్య ప్రజలు కొని తినే పరిస్థితులు లేక సతమతం అవుతున్నారని అనుకోని అదనపు బారాలు మోయడానికి వారు సిద్ధంగా లేరని కనుక వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని,స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలని,అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాత బస్టాండు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు,రామచంద్రారెడ్డి,నూర్ భాషా,ప్రసాద్,ప్రతాప్,అల్లా బకాష్,కృష్ణ,రామకృష్ణ, కిరణ్,నాగేశ్వరరావు, మనోహర్,ఖాజా,సుబ్బరాయుడు తదితర లారీ,ఆటో డ్రైవర్లు సిఐటియు కార్మికులు పాల్గొన్నారు.