నూతన శోభను సంతరించుకుంటున్న ఏలూరు రైల్వే స్టేషన్
1 min readఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో అమృత్ భారత్ పథకం కింద రూ.21 కోట్లు మంజూరు
శరవేగంగా జరుగుతున్న ఆధునికీకరణ పనులు
అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీ
ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఏలూరు పార్లమెంట్ ప్రజలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచని ఏలూరు రైల్వే స్టేషన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో నూతన శోభను సంతరించుకుంటుంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన మహేష్ కుమార్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఏలూరు జిల్లా ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్యల వలయంలో చిక్కుకున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైల్వే శాఖ కేంద్రమంత్రి, రైల్వే శాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎంపీ మహేష్ కుమార్ విన్నపాలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏలూరు రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు అమృత్ భారత్ పథకం కింద రూ.21 కోట్లు మంజూరు చేసింది. చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనులు అమృత్ భారత్ పథకం కింద కేంద్ర మంజూరు చేసిన నిధులతో ఏలూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చురుగ్గా సాగుతున్నాయి. రైల్వేలో సుదీర్ఘకాలంగా సౌకర్యాలు కొరత పెను సవాల్ గా మారిన నేపద్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ ను ఆధునిక రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాలనే ఎంపీ మహేష్ కుమార్ తలంపు కార్యరూపం దాల్చుతోంది. రైల్వే రవాణా వ్యవస్థ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉన్నందున ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకీకరణకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన కృషి ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్న అభివృద్ధి పనులతో ఫలించినట్లయింది. దేశ రవాణా రంగానికి వెన్నెముకగా ఉన్న రైల్వే ద్వారా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఎంపీ మహేష్ కుమార్ చేసిన అవిరళ కృషి ఫలితంగా ఏలూరు రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు సమకూరుతున్నాయి. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు 70% మేర పూర్తయినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లో ఫ్లాట్ ఫారం ఎత్తు పెంచి అభివృద్ధి చేసే పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల నిరీక్షణ భవనం, మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్లాట్ ఫారంపై ప్రయాణికులు నిరీక్షించే ప్రాంతాల్లో నీడను కల్పించడానికి వీలుగా రైల్వే స్టేషన్ కు ఇరువైపులా రేకుల షెడ్ల నిర్మాణం పూర్తయింది. రైల్వే స్టేషన్ చివరన ఉన్న ఫ్లాట్ ఫారం అభివృద్ధి పనులు ముమ్మురంగా జరుగుతున్నాయి. ప్రయాణికులకు శుద్ధ జలాలు అందించడం కోసం ఫ్లాట్ ఫారాలపై ప్రత్యేకంగా పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ఎదుట అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభించనున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నారు.అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మహేష్ కుమార్ లాంటి ఎంపీని గతంలో చూడలేదంటున్న పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు: ఎంపీగా అడుగుపెట్టిన వెంటనే ఏలూరు రైల్వే స్టేషన్ రూపు రేఖలు మార్చుతున్న ఎంపీ మహేష్ కుమార్ పై ఏలూరు జిల్లా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏలూరు పార్లమెంటులో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఏలూరు 85వ స్థానంలో ఉంది. ‘ఏ’ కేటగిరి రైల్వే స్టేషన్ లలో ఒకటిగా ఉన్న ఏలూరు రైల్వే స్టేషన్ నిత్యం పదివేల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. ఎంపీ మహేష్ కుమార్ కృషి ఫలితంగా భవిష్యత్తులో ఏలూరు రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధికి నోచుకుంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న మహేష్ కుమార్ లాంటి ఎంపీని గతంలో చూడలేదంటున్న పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు.