PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వీయ సత్ప్రవర్తన ద్వారానే అవినీతి నిర్మూలన

1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: అవినీతిని అంతమొందించే ప్రక్రియ స్వీయ సత్ప్రవర్తన ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉద్ఘాటించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, విజిలెన్స్ ఇంచార్జ్ డిఎస్పి కృష్ణారెడ్డి, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వారంలో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది దేశం యొక్క శ్రేయస్సు కోసం సమగ్రత, సంస్కృతి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని… ఈ మూడు పదాలలో ఎంతో అంతర్లీనత దాగి ఉందని పౌరులలో స్వీయ సత్ప్రవర్తన అలవర్చుకొని అవినీతి రహిత సమాజానికి తోడ్పాటు అందించాలన్నారు. మన సత్ప్రవర్తన ద్వారానే అవినీతి నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. అవినీతి వల్లే ప్రపంచంలో మన దేశాన్ని అత్యుత్తమ కేంద్రంగా ఎందుకు చూపించలేకపోయామో మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం రకరకాలుగా గ్రౌండింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి కేజీకి 40/- రూపాయలు ఖర్చవుతుందని, ఈ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా తక్కువ రేటుకు విక్రయించడం లాంటి వ్యత్యాసాలకు స్వస్తి పలికి  సరి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఉదహరించారు. అలాగే నకిలీ విత్తనాలు, రసాయనిక  ఎరువులతో రైతులు రైతులనే మోసం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  నిబంధనలతో సంబంధం లేకుండా అవినీతిని ప్రోత్సహిస్తూ పనులు చేయించుకునే పరిస్థితి నెల కొనిందన్నారు. ప్రతి సంస్థలో విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ మన దృక్పథం మార్చుకోనంతవరకు అవినీతి కొనసాగుతూనే ఉంటుందన్నారు.జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలన గురించి విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహించుకోవడం దురదృష్టకరమన్నారు. అవినీతిపై భారత ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ తెలిసి తెలిసి తప్పులు చేయడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, అగ్నిమాపక అధికారి , డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రమణ, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొని అవినీతి నియంత్రణపై తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. అంతకుముందు విజిలెన్స్ ఇన్చార్జి డిఎస్పి కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవినీతి నియంత్రణపై అధికారులలో అవగాహన కల్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *