PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరణించాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేదే అవయవ దానం

1 min read

– కర్నూలు డి.ఎస్.పి బాబు ప్రసాద్.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:      అవయవ దానానికి రండి మరొకరి ప్రాణాలను రక్షించండి అని డి.ఎస్పి బాబు ప్రసాద్ పిలుపునిచ్చారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో ఆ క్లబ్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి  శ్రీనివాస్ అధ్యక్షతన ఈనెల 13న అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజుల అవగాహన క్యాంపెయిన్ లో భాగంగా  డీ.ఎస్పీ కార్యాలయంలో గోడ పత్రికలను  విడుదల చేశారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ మాట్లాడుతూ అన్నదానం సాటి మనిషి కడుపు నింపితే అవయవ దానం తోటి మనిషి ప్రాణాలు నిలబెడుతుందన్నారు. రెండవ పటాలకపు అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం ఉత్తమం అయిందని ,అవయవ దానం పై పూర్తిస్థాయి అవగాహన ప్రజల్లో కలగాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు .లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు  లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మరణించాక కూడా జీవించే అవకాశం అవయవదానం వల్ల కలుగుతుందన్నారు .మూడవ పట్టణ సి.ఐ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ మరొకరి ప్రాణాల్ని కాపాడే దాతృత్వ చర్యగా అవయవ దానాన్ని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. లయన్ డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ కళ్ళు ,గుండె కిడ్నీలు ,కాలేయం, ఊపిరితిత్తులు తదితర అవయవాల  మార్పిడి అవసరం చాలా ఉందని అయితే అందుకు సరిపడే అవయవ దాతలు ముందుకు రావడం లేదన్నారు. రిటైర్డ్ విశ్వ భారతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ అనారోగ్యంతో అవయవాల వైఫల్యం చివరి దశల్లోకి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా అవయవ మార్పిడి అవసరమవుతుందని ప్రాణాలు కాపాడడానికి వేగంగా అవయవ మార్పిడి చేయాలంటే అవయవ దాతల సంఖ్య పెరగాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు క్రిస్టఫర్, మాధవ నాయుడు ,శేఖర్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author