నేటికీ అందని పంట నష్టపరిహారం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: గత ఏడాది అక్టోబర్ చివరి మాసంలో తుఫాను, పెనుగాలుల కారణంగా దెబ్బతిన్న వరి పంటకు నేటికీ కూడా పంట నష్ట పరిహారం అందలేదని రైతులు పేర్కొంటున్నారు. మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో అధికంగా వరి సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలు తుఫాన్ ల వల్ల దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ నమోదు చేసిందని పంట నష్ట పరిహారానికి సంబంధించిన నిధులు మాత్రం ప్రభుత్వం నేటి వరకు కూడా విడుదల చేయలేదని సంక్రాంతి పండగ నాటికైనా పరిహారం అందక పోతుందా అని ఆశగా ఎదురు చూశామని నిరాశే ఎదురైందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి కాక ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయని రైతులు పేర్కొన్నారు. సాధారణ రైతులతో పాటు కౌలు రైతులు కూడా నష్టపోయారని తెలిపారు ప్రస్తుతం రబీ సీజన్ లో వేసిన వరి కూడా తెగుళ్ల కారణంగా దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఒకవైపు సరియైన ధర లేకపోవడంతో పాటు మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. పేరుకు మాత్రమే రైతే రాజు…. కనీసం మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశంలో ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి అంశాలు చర్చకు తీసుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని రైతుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి.