ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్
1 min readఈనెల 18న జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాల నిర్వహణ
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీన జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ – దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామా పంచాయితీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాపులు, రైల్వేస్టేషన్లు, పరిశ్రమలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంకితభావంతో భాగ్యస్వాములు కావాలన్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడం, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటకులు, యాత్రికులు, పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం, పిల్లలు, భవిష్యత్తు తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 18వ తేదీన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను భాగస్వాములను చేస్తూ నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి భారీ ర్యాలీని ప్రారంభించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ లో స్వచ్ఛత కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి చెత్తాచెదారం తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. పరిశుభ్రత నెలకొల్పే అంశాలను పరిగణలోకి తీసుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు బహుమతులు ప్రధానం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా సంబంధిత ఉత్తమ అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంతో పాటు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ నివేదికలు పంపుతామన్నారు. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు, చెత్తకుప్పలు, బోరుబావులు, కుంటలు, చెరువులు, కాలువలు లోని వ్యర్ధ పదార్థాలను తొలగించడంతోపాటు మెగా శుభ్రత డ్రైవ్ లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమ అమలుపై ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయితీ, గ్రామస్థాయి సిబ్బంది అందరూ ప్రత్యేక దృష్టి సారించి విజయవంతం చేయాలని సూచించారు.