ప్రతి ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవాలి
1 min readరూఫ్ టాప్ పై గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, అధికారులు
78 వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది
జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రధానమంత్రి సూర్య ఘార్ యోజన ద్వారా ప్రతీ ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ప్రధానమంత్రి సూర్య ఘార్ యోజన – సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమంపై ముద్రించిన గోడ పత్రిక, కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఒక్కరూ సోలార్ విద్యుత్ వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నదని, దీనిలో భాగంగా 3 కిలో వాట్ల సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటుకు 78 వేల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. సబ్సిడీ కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.సోలార్ విద్యుత్ వినియోగంతో పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు బ్యాంకులు రుణాలను కూడా అందిస్తాయన్నారు. తూర్పుప్రాంత విద్యుత్ సంస్థ ఏలూరు జిల్లా సూపెరింటెండింగ్ ఇంజనీర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘార్ యోజన ద్వారా ప్రతీ ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ బిల్లులలో పెద్దమొత్తంలో ఆదా చేసుకోవచ్చని, వినియోగదారుడు తాను వాడుకోగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కి సరఫరా చేసినట్లయితే అందుకు విద్యుత్ సంస్థ చెల్లింపులు చేస్తుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు జిల్లాలో లక్ష కనెక్షన్లు లక్ష్యంగా నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఇంచార్జి డిఆర్ఓ ఎం. ముక్కంటి,ఆర్డీఓ ఎన్ .ఎస్.కె. ఖాజావలి , డీఆర్డీఏ పీడీ కె. విజయరాజు,ఎస్డీసీ భాస్కర్, ప్రభృతులు పాల్గొన్నారు.