ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద మొక్కలు నాటాలి
1 min readనాటిన మొక్కలు వృక్షాలు అయ్యేవరకు తల్లితండ్రుల్లా సంరక్షించాలి
నూజివీడులో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం
రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రతీ ఒక్కరూ తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెం లోని నగరవనం లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన వనమహోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొంటూ తల్లితండ్రులు మనకి జన్మనిస్తే చెట్లు మనం బ్రతికేందుకు ప్రాణవాయువును ఇస్తున్నాయని, ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లితండ్రుల పేరుమీద రెండు మొక్కలను నాటడంతో పాటు మన తల్లితండ్రులను ఎంత ఆదరణగా చూసి సంరక్షించుకుంటామో అదేవిధంగా నాటిన మొక్కలను వృక్షాలు అయ్యేవరకు పరిరక్షించాలన్నారు. భారతదేశం ఒక పుణ్య భూమి అని, కొండలు, అడవులు, నదులతో పాటు దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయన్నారు. దేశంలో అటవీ ప్రాంతాలలో ఔషధ విలువలు కలిగిన వృక్షాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఔషధ విలువలు కలిగిన చెట్ల వేర్లతో భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధులను కూడా నయం చేయవచ్చన్నారు. ప్రకృతి నుండి మనకు సహజంగా లభించే పళ్ళు, ఫలాలు వంటి వాటిని సద్వినియోగం చేసుకుంటే అనారోగ్య పరిస్థితులు దరిచేరవన్నారు. అడవుల పెంచడం, పర్యావరణ పరిరక్షణ, సహజవనరులను వినియోగం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రులు వన మహోత్సవం పేరుతో ఊరూరా వనాలు పెంచుతున్నారన్నారు. అనంతరం మంత్రికి, ముఖ్యఅతిదులకు కొల్లేరు పక్షులతో ముద్రించిన జ్ఞాపికలను బహూకరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, మొక్కలను నాటి సంరక్షిస్తామని సభికులచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాష, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర ధామ, ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, ఏలూరు సబ్-డివిజన్ డిఎఫ్ఓ శ్రీ సాయి, నూజివీడు డిఆర్ఓ హరి గోపాల్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు, డీపీవో తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డ్వామా పీడీ పి.రాము, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, స్థానిక నాయకులు బర్మా ఫణి బాబు, ప్రభృతులు పాల్గొన్నారు.