స్వరాజ్యం కోసం వడ్డే ఓబన్న చేసిన సేవలు అందరూ గుర్తించుకోవాలి.. ఎం.పి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించి స్వరాజ్యం కోసం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన నగరంలోని తన కార్యాలయంలో ఓబన్నకు నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడుగా పేరుగాంచిన వడ్డే ఓబన్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైనిక అధ్యక్షుడిగా పని చేస్తూ, రైతులపై బ్రిటిష్ వారు విధించిన పన్నులకు వ్యతిరేకంగా 1845లో నిర్వహించిన ఉద్యమం లో కీలక పాత్ర పోషించారన్నారు. తొలి నుండి వడ్డే ఓబన్న పేద రైతుల, గ్రామస్తుల హక్కులను కాపాడడానికి వారికి న్యాయం చేయాలని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రతిఘటించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు… వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్తు తరాల వారికి తెలిచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారంగా నిర్వహిస్తుందని ఎం.పి తెలిపారు.