వ్యాయామంతో… ‘గుండె’ పదిలం..
1 min readఫాస్ట్ ఫుడ్ , ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండండి…
- వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ తో ఆరోగ్యం సురక్షితం..
- సీనియర్ కార్డియాలజి వైద్యులు, విజయ దుర్గా హాస్పిటల్ ఎం.డి. డా. వసంత కుమార్
కర్నూలు, పల్లెవెలుగు: ఆధునిక సమాజంలో పని ఒత్తిడి, సెల్ఫోన్లు, టీవీల కారణంగా వ్యాయామానికి దూరంగా ఉంటున్నారని, దీంతో గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతూ… అతి చిన్న వయస్సులోనే మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీనియర్ కార్డియాలజి వైద్యులు, విజయ దుర్గా హాస్పిటల్ అధినేత డా. వసంత కుమార్. ఆదివారం నగరంలోని ఏ క్యాంపు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కార్డియాలజి, ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ నేతృత్వంలో కార్డియాలజి విద్యార్థులకు ‘ వ్యాయామం– గుండె’ సంబంధిత సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. వసంత కుమార్ విద్యార్థులకు, ప్రజలకు గుండె– వ్యాయామం సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు. మద్యం, సిగరెట్ కు బానిసైన యువత… హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన డా. వసంత కుమార్… ప్రతి రోజు గంటపాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తే గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చన్నారు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ తో గుండె జబ్బులకు దూరంగా ఉండటంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బీపీ, షుగర్ తదితర వ్యాధులు దరిచేరవని స్పష్టం చేశారు.
ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండండి..:
అంతేకాక ఫాస్ట్ ఫుడ్, బయటి ఫుడ్ భుజించడం తగ్గించుకోవాలని సూచించారు. ఫోన్లు, టీవీలకు పరిమితమై… వ్యాయామం చేయకపోవడం… ఫుడ్ కంట్రోల్ లేకపోవడం తో గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని, దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రాత్రివేళ భోజనం చేసిన తరువాత కొంత నడిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు.
‘గుండె’ పై పట్టు పెంచుకోండి:
‘గుండె’ సంబంధిత వ్యాధులు, హృదయ స్పందన తదితర అంశాలను తెలుసుకొని ఉండాలని, అప్పుడే రోగికి మెరుగైన వైద్యం అందించవచ్చని సీనియర్ కార్డియాలజి డా వసంత కుమార్ కార్డియాలజి విద్యార్థులకు సూచించారు. థీరితోపాటు ప్రాక్టికల్స్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
డా. వసంత కుమార్ కు ఘన సన్మానం:
హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థులకు ‘ వ్యాయామం– గుండె ’ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించిన సీనియర్ కార్డియాలజి, విజయ దుర్గా హాస్పిటల్ అధినేత డా. వసంత కుమార్ ను ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డా. చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్, సభ్యులు చంద్రశేఖర్ కల్కూర తదితరులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు.