కంటి జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించాలి…
1 min readఅంధత్వం వంటి తీవ్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు
జర్నలిస్టులకు సమాచార శాఖ సిబ్బందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందుతే కంటిచూపు కోల్పోవడం వంటి తీవ్ర సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూల్ నగరంలోని గాయత్రీ ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో గతంలో ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులకు, సమాచార శాఖ కు చెందిన కొంతమంది సిబ్బందికి ఉచితంగా కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానమ్ అనే సూక్తి ఉందని, మనిషి శరీరంలోని అన్ని అవయవాల కంటే కంటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇందులో భాగంగానే కంటి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. కంటి సమస్యలైన చత్వారం, గ్లోకోమా, క్యాటరాక్ట్, కార్నియా సంబంధిత సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స పొందడం ద్వారా కంటిచూపు కోల్పోకుండా చూసుకోవచ్చని వివరించారు. ఒకసారి కంటిలో ఇన్ఫెక్షన్ మొదలైతే దానిని నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలని, లేదంటే నియంత్రించడం కష్టమని వివరించారు. మనిషి ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు అంటే అది కంటి చూపు వల్లేనని ఆయన వివరించారు .ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ,అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని ఆయన కోరారు . కలుషిత నీరు తాగడం వల్ల ,అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల పలు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని ఆయన వివరించారు. కంటి జబ్బులు రాకుండా చూసుకోవాలంటే విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆకుకూరలు, పండ్లు, వంటి వాటిని అధికంగా తీసుకోవాలని ఆయన కోరారు. తన సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.